TDP JSP BJP Alliance : మళ్లీ కుదిరిన స్నేహం - 'కూటమి' ముందున్న అసలు సవాళ్లివే...!
NDA Alliance in AP : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2014 ఎన్నికల మాదిరిగానే మరోసారి NDA కూటమి బరిలోకి దిగబోతుంది. ఆ సమయంలో కేవలం మద్దతు మాత్రమే ప్రకటించిన జనసేన...ఈసారి ప్రత్యక్షంగా పోటీ చేయనుంది. అయితే పలు ప్రశ్నలు కూటమికి అతిపెద్ద సవాల్ గా మారే అవకాశం ఉంది.
NDA Alliance in AP 2024 : ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగుదేశం - జనసేన పొత్తు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని భావించినప్పటికీ…. తాజాగా బీజేపీ కూడా సీన్ లోకి వచ్చేసింది. టీడీపీ తిరిగి ఎన్డీఏలో(NDA) కూటమిలో చేరుతున్నట్లు ప్రకటన కూడా చేసింది. మూడు పార్టీల నేతల సుదీర్ఘ చర్చల అనంతరం కూటమిపై ప్రకటన వెలువడింది. త్వరలోనే సంయుక్త కార్యాచరణను ప్రకటించబోతున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ(Modi)... ఏపీ పర్యటనకు రాబోతున్నారు. టీడీపీ, జనసేన నిర్వహించబోతున్న భారీ సభకు హాజరుకానున్నట్లు ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ ద్వారానే... ఏపీలో ఎన్డీఏ కూటమి(NDA Alliance in AP) ఎన్నికల శంఖారావం పూరించబోతుందని తెలుస్తోంది.
2014లోనూ పొత్తు... ఆ తర్వాత తీవ్ర విమర్శలు….
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా కూటమికి మద్దతు ప్రకటించింది. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ భాగమైంది. కేంద్రమంత్రి పదవులను కూడా తీసుకుంది. అయితే విభజన హామీలు, కొత్త రాజధానికి సాకారం వంటి పలు అంశాల విషయంలో ఇరు పార్టీల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అనంతర పరిణామాలతో... ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని, ప్రత్యేక హోదాను ఇవ్వకపోవటం వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ... విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుబెట్టింది. ఓ దశలో మోదీ, అమిత్ షా పై యుద్ధాన్నే ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ధర్మ పోరాటం పేరుతో ఢిల్లీ వేదికగా ధర్నాలు కూడా చేపట్టారు. ఇదే సమయంలో యూపీఏ(UPA) కూటమిలోని పక్షాలకు దగ్గరయ్యారు చంద్రబాబు. కానీ చంద్రబాబు వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. కేవలం 23 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే సమయంలో కేంద్రంలో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో వచ్చిన వైసీపీ... క్రమంగా బీజేపీకి దగ్గరైపోయింది. ఫలితంగా ఈ ఐదేళ్లు కూడా తెలుగుదేశం పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా... కొంతకాలంగా వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత... రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్... వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కలిసి పోటీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. అయితే బీజేపీ కూడా తమ కూటమిలో భాగంగా ఉంటుందని పదే పదే చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. కానీ ఈ విషయంలో లైన్ క్లియర్ అయిపోయింది. ఇందులో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా చంద్రబాబు, పవన్… బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారు. కొద్దిరోజులుగా చర్చలు జరుపుతూ వచ్చారు. మరోసారి కూటమిగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.
అసలు సవాళ్లివే...!
వచ్చే ఎన్నికల్లో మరోసారి కూటమిగా కలిసి పోటీ చేయబోతున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ(TDP JSP BJP Alliance 2024). అయితే కూటమి ముందు పలు కీలక అంశాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా(Special Category Status for Andhra Pradesh) విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న అపవాదు బీజేపీపై ఉంది. ఇదే విషయంలో విభేదిస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ వీధి పోరాటాలకు దిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక క్యాపెయినింగ్ లో యాక్టివ్ గా కూడా పాల్గొంది. ఏపీకి మోదీ మోసం చేశారని తెగ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో... మళ్లీ పొత్తు అవసరం ఎందుకు వచ్చిందన్న చర్చ ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీల అమల్లో బీజేపీ పూర్తిగా విఫలమైందన్న భావన ఆంధ్రుల మనస్సుల్లో గట్టిగా ఉంది. ఈ క్రమంలో.... ఇప్పుడు ఏ అంశాల్లో సమర్ధిస్తూ పొత్తుకు వెళ్తున్నారనే విషయాన్ని టీడీపీ ప్రధానంగా ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హోదా ఇవ్వలేమని చెప్పిన బీజేపీతో మళ్లీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు..?వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్టాండ్ ఏంటన్న ప్రశ్నలు ప్రధానంగా తెరపైకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. కొత్త రాజధానికి(AP Capital ) పెద్దగా సాయం అందించలేదన్న విమర్శలు ఉన్న క్రమంలో... మరోసారి బీజేపీతో చేతులు కలపటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేంటన్న ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. అయితే ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం తెలుగుదేశం, జనసేన పార్టీలకు అతిపెద్ద సవాల్ అనే చెప్పొచ్చు…!
కేవలం వైసీపీని(YSRCP) టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లినప్పటికీ... విభజన హామీలు, ప్రత్యేక హోదా(Special Category Status for Andhra Pradesh), వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటివి మాత్రం ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ విషయాల్లో బీజేపీ నుంచి కొత్తగా ఏమైనా ప్రకటన ఉంటుందా..? అన్న డిస్కషన్ కూడా ఓవైపు నుంచి వినిపిస్తోంది. కేవలం ఏపీ అభివృద్ధి కోసమే బీజేపీతో చేతులు కలిపామని చెబితే సరిపోయే పరిస్థితి లేదు. ఇలాంటి కీలమైన అంశాలను విస్మరిస్తే… ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కూటమి పట్ల ఏపీ ప్రజల్లో సానుకూలమైన వైఖరి రావాలంటే ... టీడీపీ, జనసేన పార్టీలు కాస్త ఎక్కువగానే చొరవ తీసుకోవాల్సి ఉంటుందన్న టాక్ విపినిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించబోతున్న క్రమంలో.... ఏ ఏ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ప్రస్తావిస్తారనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రా పాలిటిక్స్ గా మారింది….!