TDP Janasena Tickets: చిచ్చు రేపిన టిక్కెట్ల ప్రకటన…ఇరు పార్టీల్లో అలకలు, ఆందోళనలు-the announcement of the tickets that caused a furore waves and agitations in both the parties ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  The Announcement Of The Tickets That Caused A Furore...waves And Agitations In Both The Parties

TDP Janasena Tickets: చిచ్చు రేపిన టిక్కెట్ల ప్రకటన…ఇరు పార్టీల్లో అలకలు, ఆందోళనలు

Sarath chandra.B HT Telugu
Feb 25, 2024 05:15 AM IST

TDP Janasena Tickets: తెలుగుదేశం , జనసేన కూటమి తరపున పోటీ చేసే అభ్యర‌్థుల ప్రకటన అగ్గి రాజేసింది. శనివారం టీడీపీ -జనసేన అభ్యర్థుల ప్రకటన వెలువడగానే రాష్ట్రంలోని పలు నియోజక వర్గాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారంతా నిరసనలకు దిగారు.

టీడీపీ-జనసేన టిక్కెట్ల కేటాయింపుపై నిరసనలు, అనంతలో ఫ్లెక్సీల దగ్ధం
టీడీపీ-జనసేన టిక్కెట్ల కేటాయింపుపై నిరసనలు, అనంతలో ఫ్లెక్సీల దగ్ధం

TDP Janasena Tickets: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటనతో అసంతృప్తి రేగింది. ఇరు పార్టీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు ఆందోళనలకు దిగారు.

ట్రెండింగ్ వార్తలు

కొన్ని చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అయ్యాయి. వైసీపీ టిక్కెట్ల ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించకపోయినా పెద్దగా హడావుడి లేకుండానే అసంతృప్తి చల్లారిపోయింది. విపక్ష టీడీపీ-జనసేనల్లో మాత్రం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన తొలిజాబితాలో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, బోడే ప్రసాద్, బుద్ధ వెంకన్న, మండలి బుద్ధ ప్రసాద్, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొలినేని రామారావు, సుగుణమ్మలు చోటు దక్కనివారిలో ఉన్నారు.

నెల్లూరులో సర్వేపల్లి నియోజకవర్గం సీటు సోమిరెడ్డికి నిరాకరించడంతో ఆయన అలక బూనారు. 30 ఏళ్లుగా జిల్లా టిడిపిలో తానే సీనియర్‌ అని ఇటీవల పార్టీలో చేరిన వారికి టిక్కెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నాకె, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కార్యాలయంలో ఫ్లెక్సీలు చించేశారు. తమ మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి క్యాంపు కార్యాలయంలో టిడిపి జెండాలు ఫ్లెక్సీలు తొలగించారు.

తంబళ్లపల్లెలో టిడిపిని ఓడిస్తాం టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. బిసి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై బీసీలు నిరసన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను ఓడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయుడు ప్రకటించారు.‌

మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు అవమానం

మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటికి మద్దతు కోరడానికి వెళ్ళిన ఈరన్న, టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, టీడీపీ శ్రేణులకు భంగపాటు తప్పలేదు. ఈరన్న, సునీల్ కుమార్ ను రానివ్వకుండా మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు ఇంటి తలుపులు వేశారు. వారిపై ఎమ్మెల్సీ వర్గీయులు చెప్పులు విసిరారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, సునీల్ కుమార్ వర్గీయులు వెనుదిరిగారు.

అటు అనంతపురంలో …

టిక్కెట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి భగ్గుమందిపెనుకొండ లో మాజీ ఎమ్మెల్యే, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కి మొండిచేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సబిత ఎంపికపై బీకే వర్గం అసంతృప్తి చేసింది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకం పై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది.

బండారు శ్రావణి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ప్రకటించారు. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి గా అమిలినేని సురేంద్ర బాబు నియమించారు. కళ్యాణదుర్గం టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉన్నారు. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబుకు సహకరించేది లేదని ఉన్నం, ఉమ వర్గీయులు ప్రకటించారు.

విజయనగరం జిల్లాలో….

టిడిపి తొలి జాబితాలో సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం తప్పలేదు. తొలి జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డారు. .

రాజాం టికెట్‌ను కొండ్రు మురళీమోహన్ సాధించుకున్నారు. చీపురుపల్లి లో కిమిడి కళా వెంకటరావు తమ్ముని కుమారుడు కిమిడి నాగార్జునను పక్కన పెట్టారు. కళా వెంకట్రావు వర్గంగా ముద్రపడిన ఎవరికి చోటు దక్కలేదు.

తూర్పుగోదావరి జిల్లా...

టిడిపి తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. రాజనగరంలో టిడిపి నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి చూపారు. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటి ఇరు వర్గాలకు క్లారిటీ రాలేదు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లాలో….

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన టిడిపి సీట్ల ప్రకటనతో ఇరుపార్టీల్లో నిరసనలు మొదలయ్యాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు ఉండి ఆచంట తణుకు సీట్లు టిడిపి అభ్యర్థులకు కేటాయించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు చింతలపూడి స్థానాలు టిడిపి కేటాయించారు.

మాజీ మంత్రి పీతల సుజాతకు టిక్కెట్ దక్కలేదు. చింతలపూడి లో నాన్ లోకల్ కి టికెట్ కేటాయింపు కేటాయించడంతో విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్ కు టికెట్ కేటాయింపు పట్ల నియోజకవర్గ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు నిరాశ తప్పలేదు. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది.

తాడేపల్లిగూడెం నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో ఎటూ తేలలేదు. ఏలూరు సిటు పై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్పల నాయుడుకు నిరాశ తప్పలేదు.

వైఎస్‌ఆర్‌ జిల్లాలో….

ఉమ్మడి కడప జిల్లా టిడిపిలో అసంతృప్తి పెల్లుబికింది. టికెట్లు ప్రకటించిన వాటితో పాటు ప్రకటించని స్థానాల్లో కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. కడప టిడిపి అభ్యర్దిగా మాధవి రెడ్డిని ప్రకటించారు. అమీర్ బాబు, ఉమాదేవిలకు మొండిచెయ్యి చూపారు.

గత కొంత కాలంగా మాధవీరెడ్డి వర్గంతో ఇరువురు నేతలకు పడటం లేదు. టికెట్ రాకపోవడంతో అమీర్ బాబు, ఉమాదేవి అసంతృప్తితో రగిలిపోతున్నారు.

రాయచోటి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారు. టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు భంగపాటు తప్పలేదు.

రమేష్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడగా మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అదే బాటలో ఉన్నారు. టికెట్లు ప్రకటించని నియోజకవర్గాల్లో టెన్షన్ నెలకొంది. కమలాపురంలో టికెట్ ఖరారు అనుకున్న ఇన్ చార్జి పుత్తా నరసింహారెడ్డికి నిరీక్షణ తప్పలేదు. అదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పోటీ పడుతున్నారు.

వీరశివారెడ్డి అడ్డుపడటంతోనే ప్రకటన ఆగిందని చెబుతున్నారు. జమ్మల మడుగులో టికెట్ అశించిన భూపేష్ రెడ్డికి నిరాశ తప్పలేదు. ఇక్కడ బిజేపి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టిక్కెట్ ఆశిస్తుండటంతో జమ్మలమడుగు ప్రకటించలేదని చెబుతున్నారు. టిక్కెట్ రాకుండా బాబాయి అడ్డుపటంతో భూపేష్ రెడ్డి రగిలిపోతున్నారు.

ప్రొద్దుటూరులో నలుగురి పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక వాయిదా పడిందని చెబుతున్నారు.జనసేనకు ఇస్తామన్న రాజంపేటలోను టిడిపి కిరికిరి చేస్తోందని చెబుతున్నారు. రైల్వేకోడూరులోను టిడిపి వర్సెస్ జనసేనగా మారింది.

విశాఖపట్నంలో కూడా అదే సీన్…

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ మొదటి జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు.బండారు సత్యనారాయణమూర్తి గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాస్ కు తొలి జాబితాలో మొండి చేయి చూపారు. అనకాపల్లిలో సీటు ఆశించిన పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించారు.

ఉమ్మడి విశాఖలో జనసేన సీనియర్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. సీట్లు ఆశించి భంగపడ్డ వారిలో పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, బోలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశి, కోన తాతారావు ఉన్నారు.

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జి పదవికి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు. టికెట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన వారికి టిక్కెట్ ఇవ్వకపోవడం పై సీనియర్లు మండిపడుతున్నారు.

కాకినాడ జిల్లాలో……

కాకినాడ జిల్లా జగ్గంపేట సీటు టిడిపి నుండి జ్యోతుల నెహ్రూ కు కేటాయించడంతో జనసేన నిరాశకు గురైంది. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళు, డబ్బులు లేని వారు టిక్కెట్లు ఆశించకూడదని విలపించారు. జగ్గంపేట సీటు ఆశించి భంగపడిన పాఠంశెట్టి .. కిర్లంపూడి మండలం గోనేడ నుండి రామవరం వరకు అనుచరులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు.

అటు పి.గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పై టిడిపి నేతలు తిరుగుబాటు ప్రకటించారు. పి. గన్నవరం నియోజకవర్గం టిడిపి టికెట్ మహాసేన రాజేష్ కి కేటాయించడంపై టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ సీనియర్ నేత డొక్కా నాధ్ బాబు ఇంటి వద్ద సమావేశం అయ్యారు.

పి.గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టిడిపి కార్యాలయాన్ని మూసేశారు. రాజేష్ కి ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఉమ్మడి అనంతలో నిరసనలు…

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా... తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాప్తాడు నుంచి పరిటాల సునీత, కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు, మడకశిర నుంచి సునీల్ కుమార్, శింగనమల నుంచి బండారు శ్రావణి, పెనుకొండ నుంచి సవిత, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.

రాప్తాడు నుంచి పోటీ చేయబోయే మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబంపై ఫ్యాక్షన్ ముద్ర ఉంది. పరిటాల కుటుంబం అనేక మంది ని పొట్టన పెట్టుకుందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉంది. వీటిని లెక్కచేయని చంద్రబాబు నాయుడు... రాప్తాడు నుంచి పరిటాల సునీత కు బరిలోకి దింపారు.

కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లు టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు చంద్రబాబు వైఖరిపై భగ్గుమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి వర్గీయులు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు చించేశారు.

పెనుకొండ నుంచి సవిత పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి అసంతృప్తి తో ఉన్నారు. బీకే వర్గీయులు ఏకంగా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఇటు శింగనమల నియోజకవర్గం లో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి.

శింగనమల అభ్యర్థి గా బండారు శ్రావణి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీడీపీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు రాజీనామా కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బండారు శ్రావణి కి టిక్కెట్ కేటాయించటం పట్ల టీడీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు.

మడకశిర అభ్యర్థి గా మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. చంద్రబాబు నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తప్పుబడుతోంది. ప్రజాదరణ కోల్పోయిన చంద్రబాబు నాయుడు... వచ్చే ఎన్నికల్లో డబ్బు, దౌర్జన్యం, ప్రలోభాలతో గెలవానుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ పొత్తు ప్రభావం పెద్దగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఉదయగిరిలో బొల్లినేని రాజీనామా…

ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారని ఆయన చేసినటువంటి సేవలను గుర్తించకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకొని కాకర్ల సురేషు అభ్యర్థిత్వన్ని ప్రకటించడం పట్ల కండ్లగుంట వెంకటరెడ్డి గత ఐదు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించినటువంటి బొల్లినేని వెంకట రామారావు తనకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా, మండల క్లస్టర్ ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించారని ఆ బాధ్యతలను ఇప్పటి వరకు వమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడి కృషి చేశామని కానీ టికెట్ బొల్లినేని రామారావుకు కాకుండా కాకర్ల సురేష్ కు టికెట్ ఇవ్వడం పట్ల మనస్థాపానికి గురవుతున్నానని కనుక బొల్లినేని రామారావు ఇప్పించినటువంటి ఆ పదవులకు తాను రాజీనామా చేస్తున్నారని త్వరలో కార్యాచరణ ఏమిటనేది తెలియజేస్తానని తెలిపారు.

WhatsApp channel