AP Administration: ఏపీలో అంతే, పోస్టింగ్‌ కోసం ఏమైనా చేస్తారు.. చివరకు ఈసీ చేతిలో బదిలీ అవుతారు!-thats it in ap they will do anything for posting finally they will be transferred in the hands of ec ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  That's It In Ap, They Will Do Anything For Posting.. Finally They Will Be Transferred In The Hands Of Ec!

AP Administration: ఏపీలో అంతే, పోస్టింగ్‌ కోసం ఏమైనా చేస్తారు.. చివరకు ఈసీ చేతిలో బదిలీ అవుతారు!

Sarath chandra.B HT Telugu
Apr 03, 2024 08:39 AM IST

AP Administration: ఏపీలో అధికార యంత్రాంగం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై వేటు వేయడంతో ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు అద్దం పట్టింది.

ఏపీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం వేటు
ఏపీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం వేటు

AP Administration: రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన ఆలిండియా సర్వీస్ అధికారులు AIS చివరకు ఎన్నికల సంఘం Election commission ఆగ్రహానికి గురై అవమానాల పాలవుతున్నారు. వరుసగా రెండోసారి సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ క్యాడర్‌ ఆలిండియా సర్వీస్ అధికారులు ఎన్నికల సంఘం వేటు వేసింది.

ట్రెండింగ్ వార్తలు

సరిగ్గా ఐదేళ్ల కిందటి సీన్‌ మళ్లీ ఏపీలో రిపీట్ అయ్యింది. Political Parties రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిన అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల నుంచి ముగ్గురు ఐఏఎస్‌ IAS, ఐదుగురు ఐపీఎస్‌ IPSలపై వేటు వేసింది. ఇప్పటికే వేటు పడిన వారితో కలిపితే మొత్తం 9మంది ఈసీ ఆగ్రహానికి గురయ్యారు.  దాదాపు రెండు వారాలుగా అంతా ఊహించిందే అయినా ఈసీ ఆగ్రహానికి గురైన అధికారుల జాబితా రెట్టింపు కావడమే విశేషం.

ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారుల తీరుపై కొరడా ఝుళిపించింది. అప్పట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వైసీపీ అభియోగాలతో ఎస్పీ స్థాయి అధికారులైన రాహుల్‌ దేవ్‌ శర్మ (కడప), శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, ఇంటెలిజెన్స్ విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావులను ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత రాహుల్‌దేవ్‌, వెంకటరత్నంలను మాత్రమే బదిలీ చేయాలని జాబితా సవరించారు.

అదే సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా విషయంలో తలెత్తని వివాదం ఏకంగా చీఫ్‌ సెక్రటరీ పదవి కోల్పోవడానికి కారణం అయ్యింది. సిఎస్‌కు తెలియకుండానే ఆయన పేరుతోనే జీవో జారీ కావడంతో అవమానకరమైన పరిస్థితుల్లో 2019లో పదవి కోల్పోయారు.

ఎన్నికల సంఘం పరిధిలోకి నిఘా విభాగం అదనపు డీజీ రారని రాష్ట్ర ప్రభుత్వం జీవో 720 జారీ చేయడం, ఎన్నికల సంఘం దానిని High Courtలో సవాలు చేయడంతో మొదలైన వివాదం చివరకు సిఎస్‌ పదవి నుంచి తప్పకోడానికి కారణమైంది. నిఘా విభాగాధిపతిని మినహాయిస్తూ తాను జీవో ఇవ్వలేదని సిఎస్‌ చెప్పుకున్నా ఫలితం లేకపోయింది.

చీఫ్‌ సెక్రటరీ డిజిటల్‌ కీతో జీవో జారీ కావడంతో ఆయనపై ఈసీ వేటు వేసింది. హైకోర్టు తీర్పుతో నిఘా విభాగం అధిపతి ఏబీ వెంకటేశ్వరరావును కూడా తప్పించారు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు చీఫ్‌ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠాను కూడా ఈసీ బదిలీ చేయడంలో ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంకు బాధ్యతలు అప్పగించారు.

రెట్టింపైన అధికారుల జాబితా….

ఐదేళ్ల తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈసీ ఆగ్రహానికి గురైన అధికారుల జాబితా రెట్టింపు అయ్యింది. ఈ జాబితా మరింత పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ మీద కూడా చర్యలకు టీడీపీ పట్టుబడుతోంది. ఉన్నత స్థానాల్లో ఉన్న మరికొందరు అధికారుల్ని కూడా తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మంగళవారం ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాల కలెక్టర్లు పోస్టింగులు కోల్పోయారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీశలను పోస్టింగ్‌ల నుంచి ఈసీ తప్పించింది. అంతకు ముందు గిరిషాను ఈసీ సస్పెండ్ చేసింది. పోస్టింగ్ వచ్చిన వెంటనే టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డిని ప్రసన్నం చేసుకోడానికి ఆయన ఇంటికి తిరుపతి కలెక్టర్ వెళ్లడంపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన ఈసీ వేటు వేసింది. ఉరవకొండ ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై పట్టించుకోలేదని గతంలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కలెక్టర్ గౌతమిపై గతంలో ఈసీకి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీబీఐ జేడీపై ఎస్పీ అన్బురాజన్ అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు కడప నుంచి అనంతపురం బదిలీ చేశారు. వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఎస్పీపై ఈసీ వేటు వేసింది. కృష్ణాజిల్లా కలెక్టర్ రాజబాబు మాజీ మంత్రి పేర్నినాని చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇక ప్రధాని భద్రతా ఏర్పాట్లను గాలికి వదిలేసినందుకు గుంటూరు రేంజీ ఐజీ పాలరాజు మీద, పల్నాడులో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో

ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ప్రకాశం జిల్లా పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిలను ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల విధులను అప్పగించవద్దని ఆదేశించింది.

మితిమీరిన స్వామి భక్తికి మూకుతాడు..

పొరుగున ఉన్న తెలంగాణలో లేని జాఢ్యం ఏపీలో మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తమ వర్గానికి పోస్టింగుల్లో ప్రాధాన్యం ఇవ్వడమే విపరీత ధోరణి రాష్ట్ర విభజన తర్వాత పెరిగిపోయింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ వర్గానికి చెందిన అధికారుల్ని అందలం ఎక్కించడం సాధారణం అయిపోయింది.

దీంతో మంచి పోస్టింగులు, కీలక శాఖల్ని దక్కించుకోడానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యా ఎస్‌ అనడానికి సంకోచించడం లేదు. అలా చేయని వారిని ముక్కుసూటిగా వ్యవహరించే వారిని నిన్సంకోచంగా పదవుల నుంచి తప్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వంలో కీలకం వ్యవహరించే వ్యక్తి ఆదేశాలను పాటించనందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని బదిలీ చేశారు. ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా తమ పంతం నెగ్గించుకున్నాారు.

అధికారంలో ఉన్న పార్టీలకు నచ్చనివారు, తమ మాట వినని వారిని నిర్దాక్షణ్యంగా లూప్‌లైన్‌లోకి తప్పించడం ఏపీలో రివాజుగా మారింది. సీనియారిటీ, సామర్థ్యంతో సంబందం లేకుండా వారిని పక్కకు తప్పిస్తుండటం, మాట వినే వారిని అక్కున చేర్చుకోవడం పార్టీలకు అలవాటై పోయింది. దీంతో ఒకే బ్యాచ్‌కు చెందిన వేర్వేరు అధికారుల్లో కొందరు కీలక స్థానాల్లో ఉంటే మరికొందరు సాధారణ పోస్టింగ్‌లకు పరిమితం అవుతున్నారు. కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లలో కొందరికి ఐఏఎస్‌ హోదా వచ్చిన తక్కువ కాలంలోనే జిల్లా కలెక్టర్లుగా పదోన్నతి లభిస్తే మరికొందరు మాత్రం జాయింట్‌ కలెక్టర్ స్థాయిలోనే ఉండిపోయారు.

బంధువులు, సొంత సామాజిక వర్గం, చెప్పినట్టు తలాడించే అధికారులకు ఏపీలో ప్రాధాన్య పోస్టులు దక్కుతాయనే విమర్శ ఉంది. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో మరోమారు అది స్పష్టం అయ్యింది. ఈసీ వేటుకు గురయ్యే తర్వాత జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

WhatsApp channel

సంబంధిత కథనం