TDP Darsi Candidate Gottipati Lakshmi : ప్రచారాన్ని ఆపేసి పసిబిడ్డకు ప్రాణం పోశారు..!
TDP MLA Candidate Dr Gottipati Lakshmi: తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పెద్ద మనసును చాటుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉండగా.. ప్రచారాన్ని ఆపేసి గర్భిణీకి డెలివరీ చేసి పసిబిడ్డకు ప్రాణం పోశారు.
TDP Darsi MLA Candidate Dr Gottipati Lakshmi: ఏపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ అభ్యర్థులు స్పీడ్ పెంచే పనిలో పడ్డారు. అయితే ఎన్డీయే (NDA)కూటమి తరపున పోటీ చేస్తున్న దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాత్రం…. పెద్ద మనసును చాటుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సమాచారం తెలిసి… ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. ఓ గర్భిణీకి డెలివరీ చేసి పసిబిడ్డకు ప్రాణం పోశారు. తల్లిబిడ్డా కూడా క్షేమంగా బయటపడ్డారు.
ఏం జరిగిందంటే…?
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి(Dr Gottipati Lakshmi)… తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా… ఈ గురువారం కూడా ప్రచారానికి వెళ్లారు. అయితే ఓ గర్భిణీ స్త్రీకి ఇబ్బందిగా ఉందని… ఉమ్మనీరు కోల్పోయిందని… ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని సమాచారం అందింది. పేషెంట్ చేరిన ఆస్పత్రిలో ఆ సమయానికి గైనకాలాజిస్ట్ లేకపోవటంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లే అవసరం పడింది. ఇదే సమాచారం… ప్రచారంలో ఉన్న గొట్టిపాటి లక్ష్మికి చేరింది. వెంటనే పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వచ్చిన లక్ష్మి…. వైద్య సేవలు అందించారు. ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డను కాపాడారు.
‘తల్లి బిడ్డా సురక్షితంగా ఉన్నారు.తెలుగుదేశం గెలిస్తే ఇక్కడ ఆస్పత్రిని నిర్మిస్తాను’ అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్డీటీవీతో చెప్పారు. ఇక బిడ్డ ప్రసవాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ కూడా చేశారు గొట్టిపాటి లక్ష్మి. "ఈ భూమిపైకి జీవితాన్ని స్వాగతించడం కంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు ఆనందాన్ని ఇవ్వదు. పిల్లల చిరునవ్వు నన్ను మరింతగా ప్రేరేపిస్తుంది. ఇది చాలా మంచి రోజు” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
వృత్తి ధర్మాన్ని పాటించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి పలువురు అభినందనలు తెలిపారు. గుడ్ జాబ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఇందులో జనసేన కూడా భాగంగా ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 సీట్లలో, 21 సీట్లలో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.