EC On HighCourt: ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులపై ఉత్కంఠ, ఈసీ వైఖరిపై పార్టీల్లో సందేహాలు,డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం!-suspense over anticipatory bail orders doubts among parties on ec stand ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec On Highcourt: ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులపై ఉత్కంఠ, ఈసీ వైఖరిపై పార్టీల్లో సందేహాలు,డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం!

EC On HighCourt: ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులపై ఉత్కంఠ, ఈసీ వైఖరిపై పార్టీల్లో సందేహాలు,డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం!

Sarath chandra.B HT Telugu
May 24, 2024 07:52 AM IST

EC On HighCourt: ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఈవిఎంల ధ్వంసం కేసుల్లో వైసీపీ, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర‌్థుల్ని జూన్ 6వరకు అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడంపై ఉత్కంఠ రేగుతోంది. సింగల్ జడ్జి ఉత్తర్వులను ఎన్నికల సంఘం సవాలు చేస్తుందా లేదా అనేది చర్చగా మారింది.

ముందస్తు బెయిల్ ఉత్తర్వుల్ని ఈసీ సవాలు చేయడంపై సందేహాలు..
ముందస్తు బెయిల్ ఉత్తర్వుల్ని ఈసీ సవాలు చేయడంపై సందేహాలు.. (HT_PRINT)

EC On HighCourt: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటి నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మాచర్లలో పోలింగ్ సందర్భంగా ఈవిఎంను స్వయంగా ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరయ్యే వరకు పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మే 20వ తేదీన రెంటచింతల పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్‌లో జరిగిన దాడి ఘటన దృశ్యాలు వెలుగు చూశాయి.

పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి స్వయంగా ఈవిఎంను పగులగొట్టారు. పిన్నెల్లి దాడి దృశ్యాలు మాత్రమే బయటకొచ్చాయి. మిగిలిన కేంద్రాల వీడియోలు ఎందుకు బయటకు రాలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు 21వ తేదీన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి పరారయ్యారు. ఎమ్మెల్యే అరెస్ట్ కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసిన అచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. గురువారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉపశమనం దక్కించుకున్నారు. బెయిల్ వచ్చే వరకు అరెస్ట్‌ కాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగారు.

మరోవైపు జూన్‌ 6వ తేదీ వరకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు గురువారం రాత్రి ఆదేశించింది. పోలింగ్‌ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈసీ స్పందనపై ఉత్కంఠ…

ఎన్నికల నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులపై ఈసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం ముందస్తు బెయిల్ పొందిన వారిలో వైసీపీ, టీడీపీలకు చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు. పిన్నెల్లితో పాటు గోపిరెడ్డి, పెద్దారెడ్డిలకు కూడా ఉపశమనం దక్కింది. అటు టీడీపీ జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్‌లకు కూడా ముందస్తు బెయిల్ వచ్చింది.

ఈ నేప్యంలో సింగల్ జడ్జి ఉత్తర్వులను ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాలు చేస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. రెండు పార్టీలకు చెందిన నాయకులు తమకు పట్టున్న ప్రాంతాల్లో ఎన్నికల హింసకు కారణమయ్యారు. ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రమే వీడియోల్లో దొరికిపోయారు. ఇతర ఘటనల్లో మిగిలిన నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో వారంతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో కేసుల్లో చిక్కుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలను జూన్ 6వరకు అరెస్ట్ చేయరాదంటూ ఏపీ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిందితులు సేఫ్‌గా ఉంటారు. కోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పాక్షిక ఎన్నికలు జరగాలని ఈసీ భావిస్తే ఏపీలో మాత్రం అది సాధ్యపడలేదు.

మాచర్లలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవిఎంను ధ్వంసం చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. మే 13 నుంచి నాటకీయ పరిణామాల మధ్య మే 20వ తేదీన వెబ్‌కాస్టింగ్‌ వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

పిన్నెల్లితో పాటు తాడిపత్రికి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ వంటి వారు కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి జూన్ 6వరకు అరెస్ట్‌లు చేయొద్దని విచారణ వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు తాడిపత్రిలో అడుగు పెట్టొద్దని వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్ని ఆదేశించారు.

టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు ఈసీ స్పందించిందని, ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షలు పడేవే కావడంతో, అలాంటి కేసుల్లో అరెస్ట్‌లు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు అర్నేష్‌కుమార్ కేసులో ఆదేశించిందని ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనల్లో పిన్నెల్లి న్యాయవాది గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పోలీసుల్ని ఆదేశించే అధికారం ఈసీకి లేదని పిన్నెల్లి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు.

మరోవైపు పిన్నెల్లికి బెయిల్ ఇవ్వొద్దని ఈవిఎం ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ఘర్షణల కేసుల్లో అరెస్ట్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జూన్‌ 6వరకు అరెస్ట్‌లు చేయొద్దనే కోర్టు ఉత్తర్వుల్ని ఎన్నికల సంఘం సవాలు చేస్తే తాము స్వాగతిస్తామని టీడీపీ చెబుతోంది. ఎన్నికల ఘర్షణలన్నీ అధికార పార్టీ ప్రేరేపించినవేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

పోలింగ్ బూత్‌ సిబ్బంది సస్పెన్షన్…

పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్‌లో పిఓగా విధులు నిర్వర్తించిన సత్తెనపల్లి జేకేసీ కాలేజీ అధ్యాపకుడు పీవీ.సుబ్బారావుతో పాటు ఏపీఓగా పనిచేసిన వెంకటాపురం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు షేక్‌ షహనాజ్‌ బేగంలను ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవిఎం పగులగొట్టినా ఫిర్యాదు చేయకపోవడం, విఆర్వో ఫిర్యాదు చేసే వరకు కేసు నమోదు చేయకపోవడం వంటి కారణాలతో వారిని సస్పెండ్ చేశారు. ఈసీ ఆదేశాలతో వారిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలజీరావు ఉత్తర్వులు జారీ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం