NDA Alliance in AP : పట్టుబట్టి, కూటమిగా జట్టుకట్టి - మ్యాచ్ విన్నర్ జనసేనాని 'పవనే'..!
Andhrapradesh Election Results 2024 : ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని ఆధిపత్యంతో అధికార పీఠాన్ని అధిష్టించనుంది. అయితే కూటమి ఏర్పాటు నుంచి విజయం సాధించే వరకు పవన్ కీలకంగా పని చేశారు.
Janasena Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. అంచనాలను మించి… తిరుగులేని ఆధిపత్యంతో పీఠంపై కూర్చోబోతుంది. కూటమి దెబ్బకు వైసీపీ పూర్తిగా చతికిలపడిపోయింది. అయితే ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు నుంచి ఈ ఎన్నికల్లో విజయం సాధించే వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకంగా పని చేశారని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

పట్టుబట్టి… కూటమిగా జట్టుకట్టి….
ఏపీలో కూటమి విజయం సాధించటంలో పవన్ ది అత్యంత కీలక పాత్ర ఉందని చెప్పొచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి 2019 ఎన్నికల్లో ఎవరికి వారుగా ఒంటరిగా పోటీ చేయటంతో…. వైసీపీకి కలిసి వచ్చింది. ఫలితంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సింగిల్ గా పోటీ చేసిన పార్టీలు… కనీసం పోటీ ఇవ్వలేని స్థితికి చేరాయి.
2019 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేన… కామ్రేడ్లతో పాటు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన పవన్… ఓటమి పాలయ్యారు. పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలామాలో పడిపోయింది.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కల్యాణ్… పూర్తిగా వ్యూహాం మార్చేశారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. వారితో స్నేహంగా ఉంటూనే…మరోవైపు తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు. సందర్భాన్ని బట్టి…. కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు.
ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యకమైనప్పటికీ…. పట్టు విడవకుండా ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే… మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్…. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. తమ కూటమిలో బీజేపీ ఉంటుందని బలంగా నొక్కి చెప్పారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలన్నదే తన నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతూ వచ్చారు.
చివర్లో ఏపీలో ఎన్డీయే కూటమి పోటీకి లైన్ క్లియర్ అయింది. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయేలో చేరింది. సీట్లు కేటాయింపులో కూడా పవన్ కాస్త వెనక్కి తగ్గారనే చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు అంచనా వేసుకునే… ఓ నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా 21 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. ఇక ప్రచారంలోనూ దూకుడుగా ముందుకెళ్లారు. వైసీపీ విధానాలపై సూటిగా ప్రశ్నిస్తూ… జనాల్లో ఆలోచనలో పడేశారనే చెప్పొచ్చు. ఇక పిఠాపురంలో పోటీ చేసిన పవన్… భారీ విజయాన్ని అందుకోనున్నారు.
మొత్తంగా ఏపీలో కూటమి బంపర్ విక్టరీ కొట్టడంలో పవన్ కీలకంగా పనిచేశారన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటులో పవన్ ది కీ రోలో అని… కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కూడా పవన్ కీలక శక్తిగా ఉంటారని అంచనా వేస్తున్నారు.