Vijayawada West: అభివృద్ధిలో లాస్ట్... అవినీతిలో ఫస్ట్..బెజవాడ పాతబస్తీ రాజకీయం, తాజా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
Vijayawada West: ఓ వైపు కొండలపైకి ఎగబాకిన పేదరికం, మరోవైపు కోట్లలో జరిగే వాణిజ్యం అదే బెజవాడ పశ్చిమ నియోజక వర్గం ప్రత్యేకత.హోల్‌సేల్ వ్యాపారాలతో నాలుగైదు జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా నిలిచే ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే... ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రతినిధులే దీనికి ప్రధాన కారణం...
Vijayawada West: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో Elections ఆసక్తికరమైన పోటీ నెలకొన్న నియోజక వర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఒకటి.కూటమిలో పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గాన్ని బీజేపీ BJPకి కేటాయించారు. 2014లో ఇదే కూటమి తరపున బీజేపీ పక్షాన పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు 3వేల ఓట్లతో ఓడిపోయారు. 2019లో వైసీపీ తరపున 7671 ఓట్లతో విజయం సాధించారు. 2014లో వైసీపీ తరపున గెలుపొందిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2019లో జలీల్ ఖాన్ కుమార్తె షబనా ఖాతూన్ ఓటమి పాలయ్యారు.
మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండే Vijayawada పశ్చిమ నియోజక వర్గంలో 1972లో అసిఫ్ భాషా, 1989లో ఎంకె.బేగ్, 99,2014లో జలీల్‌ఖాన్, 2004లో నాసర్ వలీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీల పరంగా చూస్తే 1983తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీ అభ్యర్థి పశ్చిమ నియోజక వర్గంలో గెలవలేదు. 1999లో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జలీల్ ఖాన్ విజయం సాధించారు.
2004లో టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కూడా జలీల్‌ఖాన్‌కు పోటీ చేసే అవకాశం రాలేదు. 2009లో పిఆర్పీ తరపున గెలిచిన వెల్లంపల్లి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి జలీల్‌ఖాన్ వైసీపీలో చేరారు.
సామాజిక వర్గాల వారీ ఓటర్లు...
2024తుది ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో 1,24,408మంది పురుష ఓటర్లు, 1,27,026మంది మహిళలతో కలిపి మొత్తం 2,51465మంది ఓటర్లు ఉన్నారు. నియోజక వర్గంలోని మొత్తం ఓటర్లలో 15.37శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. రెండో ప్రధాన వర్గంగా నగరాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 10.19శాతం ఉన్నారు.
తెలగ, కాపు,బలిజ సామాజిక వర్గ ఓటర్లు 10.15శాతం ఉన్నారు. మాల సామాజిక వర్గం ఓటర్లు, 7.43శాతం, వైశ్య సామాజిక వర్గంలో 7.38శాతం ఓటర్లు, మాదిగ సామాజిక వర్గంలో 5.80శాతం ఓటర్లు, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 4.76శాతం, బ్రాహ్మణలు 4.72శాతం, యాదవ సామాజిక వర్గం 3.92శాతం, వడ్డెర ఓటర్లు 3.78శాతం, దూదేకుల ఓటర్లు 2.88శాతం, గౌడ ఓటర్లు 2.45శాతం, మార్వాడీ, అగర్వాల్చ, గుజరాతీ, సేఠ్ వర్గాల ఓటర్లు 2.15శాతం, ఎస్టీలు 2.06శాతం ఉంటారు.
మిగిలిన కులాల్లో పద్మశాలీ ఓటర్లు 1.89శాతం, రెల్లి ఓటర్లు 1.97శాతం, విశ్వబ్రహ్మణ-కంసాలి ఓటర్లు 1.88శాతం, కమ్మ ఓటర్లు 1.88శాతం, క్షత్రియ ఓటర్లు 1.77శాతం, రజక ఓటర్లు 1.72శాతం, నాయిబ్రహ్మణలుు 1.66శాతం, మత్స్యకారులు 1.57శాతం, గవరలు 0.66శాతం, వెలమ ఓటర్లు 0.58శాతం, క్రిస్టియన్ ఓటర్లు 0.42శాతం, బీహార్, యూపీ ఓటర్లు 1శాతం ఉంటారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ముస్లిం అభ్యర్థులు ఐదు సార్లు, నగరాలు 2సార్లు, వైశ్యులు రెండు సార్లు, కాపులు ఒక్కసారి, క్రిస్టియన్ అభ్యర్థి ఒకసారి, క్షత్రియులు ఒకసారి విజయం సాధించారు.
అభివృద్ధికి ఆమడ దూరం....
విజయవాడ పాతబస్తీ ప్రాంతం పూర్తిగా కొండ ప్రాంతాల్లో ఉంటుంది. జనాభాలో సగానికి పైగా కొండల మీద నివాసాలు ఏర్పరచుకుని నివసిస్తున్నారు. ఈ ప్రాంతం విస్తరించడానికి అవకాశం లేకపోవడంతో పేదలు కొండలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం వందల మెట్లు పైకెక్కి ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితిలో ప్రజలు నివసిస్తుంటారు.
ఓ వైపు కృష్ణానది, మరో రైల్వే లైన్లు, మరో వైపు కొండల మధ్య చిక్కుకుపోవడంతో జనాభా పెరుగుతున్నా ఈ ప్రాంతం విస్తరించడానికి ఏ మాత్రం అవకాశం లేదు. దీంతో ఈ నియోజక వర్గంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే అపవాదు ఉంది.
విజయవాడ పాతబస్తీ ఇరుకు రోడ్లను 2003లో చివరి సారి విస్తరించారు. అప్పట్లో రాజకీయ విమర్శలు ఎన్ని వచ్చినా వెనుకంజ వేయకుండా అన్ని ప్రధాన రోడ్లను వీలైనంత విస్తరించారు. బిఆర్పీ రోడ్డు, పిజెఎన్ రోడ్డు, బ్రహ్మణ వీధి, గణపతిరావు రోడ్డు, కేటీ రోడ్డు వంటి ప్రధాన మార్గాలను ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విస్తరించారు.
అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రోడ్ల విస్తరణ కొనసాగించారు. 2004లో టీడీపీ ఓటమి పాలవడంతో ఆ విస్తరణ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు పుష్కర కాలం తర్వాత 2016లో కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పాతబస్తీ రోడ్లను మరోమారు విస్తరించారు. రోడ్లకు అడ్డంగా నిర్మించిన మతపరమైన నిర్మాణాలను కూడా తొలగించి ప్రజలకు అనువుగా మార్చారు.
పాతబస్తీలో టీడీపీ హయంలో రోడ్ల విస్తరణ జరిగితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతినిధులు ఆ రోడ్ల మీద వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారనే విమర‌్శలు ఉన్నాయి. విస్తరణ చేపట్టినంత రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునేలా అనుమతులిచ్చి సంపాదించుకోవడం స్థానిక నేతలకు అలవాటుగా మారింది.
కృష్ణా ముంపు ప్రాంతమైనా...
విజయవాడలో వరద ముంపు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో వెయ్యి కోట్లను మంజూరు చేసింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో వరద నివారణ కోసం వీటిని విడుదల చేశారు. విజయవాడలో తీవ్రమైన వరద ముంపును ఎదుర్కొనే పాతబస్తీలో మాత్రం ఆ నిధులు ఖర్చు చేయలేదు. దశాబ్దాల క్రితం బ్రిటిష్ హయంలో నిర్మించిన ఔట్ ఫాల్ డ్రెయిన్ల మీదే ఇంకా ఆధార పడ్డారు. మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకు రైల్వేలు అడ్డం పడటం ఈ ప్రాంతానికి శాపంగా మారింది.
మైనార్టీ వర్సెస్ బీజేపీ...
తాజా ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బీజేపీ తరపున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున కార్పొరేటర్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. 2014,19లో రెండుసార్లు వైసీపీ తరపున అభ్యర్థులు గెలిచారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న మైనార్టీ ఓటర్లపై నమ్మకంతో ఆ పార్టీ అదే వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేసింది.
2019లో వైసీపీ తరపున గెలిచిన వెల్లంపల్లి ప్రభావం నియోజక వర్గంపై అధికంగా ఉంది. నాటి ఎన్నికలకు ముందు స్థానిక వ్యాపారుల నుంచి ఆర్ధిక సాయం పొందిన వెల్లంపల్లి తర్వాతి కాలంలో వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే ప్రచారం ఉంది. ఆ ప్రభావంతోనే వెల్లంపల్లిని మరో నియోజక వర్గానికి మార్చారు. మరోవైపు జనసేన తరపున టిక్కెట్ ఆశించిన పోతిన మహేష్.. బీజేపీ అభ్యర్థికి ఎంతమేరకు సహకరిస్తాడనేది కూడా ఎన్నికలపై ప్రభావం చూపనుంది.
పశ్చిమ నియోజక వర్గంలో మైనార్టీల తర్వాత అధిక సంఖ్యలో ఎస్సీ ఓటర్లుఉన్నారు. మాల,మాదిక, రెల్లి సామాజిక వర్గాలకు దాదాపు 15శాతం ఓట్లు ఉన్నాయి. అధికార పార్టీలో ఆ వర్గాలకు తగిన ప్రాధాన్యత లేదనే భావన బలంగా ఉంది. మంత్రి పదవి వచ్చాక వెల్లంపల్లి ఎస్సీలను అణిచి వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయా సామాజిక వర్గాల ఓటర్లు నివసించే ప్రాంతాల్లో ఇతర వర్గాల నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వైసీపీ మెడకు చుట్టుకుంది.
కార్పొరేటర్ల అవినీతి కీలకాంశమే...
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ఓటర్లకు ప్రజాప్రతినిధుల అవినీతే Curruption ప్రధాన సమస్య.. చిన్నపాటి నిర్మాణాలకు కూడా కప్పం కట్టుకోవాల్సిన దుస్థితి ఈ ప్రాంత ప్రజల్ని వేధిస్తోంది. నగర పాలక సంస్థను గుప్పెట్లో పెట్టుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజల్ని పీడించడం, అక్రమ కట్టడాలకు అనుమతులు పేరుతో దండుకోవడం ప్రధాన సమస్యగా ఉంది.
రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండటం, రోడ్లకు కనెక్టివిటీ లేకపోవడం, అవసరమున్న చోట కూడా విస్తరణకు నోచుకోకపోవడంపై ప్రజలు గూడుకట్టుకున్న అసంతృప్తి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపనుంది.
వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ ASIFను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కూటమి తరపున బడా పారిశ్రామిక వేత్త, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. మైనార్టీ ఓట్ల మీద అధికార పార్టీకి భరోసా ఉన్నా, మిగిలిన సామాజిక వర్గాల ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది.
సంబంధిత కథనం