AP Election Results 2024 : పని చేయని వైసీపీ 'సంక్షేమ మంత్రం' - కూటమికే జై కొట్టిన ఆంధ్రా జనం..!
AP Assembly Election Results 2024 : ఏపీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా కూటమి దూసుకెళ్తోంది. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ…పూర్తిగా చతికిలపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
AP Assembly Election Results 2024 : ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ వరకు…. ఎన్డీయే కూటమి అభ్యర్థులు భారీ విజయం దిశగా ముందుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. కూటమిలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీనే దాదాపు 115 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక జనసేన 15 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో పాగా వేసే దిశగా ముందుకెళ్తున్నాయి.
ఇక వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ పూర్తిగా చతికిలపడిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.... పెద్ద ఎత్తున కసరత్తు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. దాదాపు కూటమి ఏపీలో సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
పని చేయని వైసీపీ సంక్షేమ మంత్రం...!
2024 ఎన్నికల సంబంధించి పూర్తిగా సంక్షేమ మంత్రంతోనే ఎన్నికలకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టింది. ఇందుకోసం భారీగా పథకాలను తీసుకువచ్చింది. నేరుగా డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే స్కీమ్ లను అమలు చేసింది. నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటిలోని ఒకరు ఏదో ఒక స్కీమ్ లబ్ధిదారుడు ఉన్నారని చెప్పుకుంటూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పూర్తిస్థాయిలో తమ వైపే నిలుస్తాయని భావిస్తూ వచ్చింది.
సంక్షేమ మంత్రంతో ఓట్ల పోల్ మేనేజ్మెంట్ పై భారీ ఆశలు పెట్టుకుంది వైసీపీ. కానీ తీరా ఎన్నికల ఫలితాలను చూస్తే మాత్రం... సీన్ రివర్స్ అయింది. వంద సీట్లు దాటుతామని అంకెలు, లెక్కలు వేస్తూ వచ్చినప్పటికీ... ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించలేదు.
కూటమికి పోటీ ఇవ్వటంలో పూర్తిగా వెనకబడి పోయింది. ఓ రకంగా చెప్పాలంటే.... ఆంధ్రదేశ్ లో కూటమిది ఏకపక్ష విజయంగానే భావించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్… అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేశారన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు తాజా ఫలితాలను చూస్తే అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకంగా మారారనేది సుస్పష్టం. ఇక తుది ఫలితాలు వచ్చే వరకు.... ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి గణాంకాలు నమోదవుతాయో చూడాలి...!