TDP Strategy: టీడీపీ పొత్తు లక్ష్యం నెరవేరుతోందా? ఆ అధికారులే అసలు లక్ష్యమా? పురంధేశ్వరి ఫిర్యాదుతో కొత్త చర్చ-is the tdp alliance achieving its goal are those officers the real target ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Strategy: టీడీపీ పొత్తు లక్ష్యం నెరవేరుతోందా? ఆ అధికారులే అసలు లక్ష్యమా? పురంధేశ్వరి ఫిర్యాదుతో కొత్త చర్చ

TDP Strategy: టీడీపీ పొత్తు లక్ష్యం నెరవేరుతోందా? ఆ అధికారులే అసలు లక్ష్యమా? పురంధేశ్వరి ఫిర్యాదుతో కొత్త చర్చ

Sarath chandra.B HT Telugu

TDP Strategy: బీజేపీతో జట్టు కోసం టీడీపీ తహతహలాడటం వెనుక అసలు లక్ష్యం నెరవేరుతోందా... బీజేపీ డిమాండ్లకు తలొగ్గడం, అడిగినన్నీ సీట్లను కేటాయించడం వెనుక అసలు అమలవుతోందా..?

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు లక్ష్యం నెరవేరుతోందా..?

TDP Strategy: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఓడించే లక్ష్యంతో ప్రధాన పార్టీలు Allianceతో  ఏకమయ్యాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన మూడు పార్టీలు పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చాయి. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే ఏకైక లక్ష్యంతో టీడీపీని బీజేపీకి చేరువ చేయడానికి తీవ్రంగా శ్రమించినట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

ఎన్నికల అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో టీడీపీ కోరుకున్న ఊరట దక్కుతున్నట్టే కనిపిస్తోంది. ఒంటరిగా ఎవరి సాయం లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే విజయం అంత సులువు కాదనే విషయం స్పష్టం కావడంతోనే టీడీపీ ఎన్నికల పొత్తుకు సిద్ధమైందనే ప్రచారానికి ఊతమిచ్చేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టై జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో మూడు పార్టీల మధ్య పొత్తు వికసించింది. చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు బెయిల్ కూడా రాకుండా రాజమండ్రి జైల్లో ఉంచారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన పవన్.. టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోరాడతామని ప్రకటించారు.

ఆ తర్వాత దాదాపు యాభై రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే గడపాల్సి వచ్చింది. 2018లో వీడిన ఎన్డీఏలో తిరిగి చేరాల్సిన అనివార్య పరిస్థితులు చంద్రబాబుకు ఎదురయ్యాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఢీకొట్టడానికి తన శక్తియుక్తులు చాలవనే సంగతి చంద్రబాబుకు అవగతం కావడంతోనే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించారు. ఆ పార్టీ అడిగినన్ని అసెంబ్లీ, లోక్‌సభ టిక్కెట్లను కేటాయించారు.

ఏపీలో బలమైన పునాదులు ఉన్న టీడీపీ.. రాజకీయ అస్తిత్వం కోసమే జనసేన, బీజేపీలతో చేతులు కలిపింది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ కోరుకున్న ఊరట దక్కుతోంది. ఐదేళ్లుగా టీడీపీని ముప్పతిప్పలు పెట్టిన అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇప్పటికే నలుగురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఐపీఎస్‌లను ఈసీ బదిలీ చేసింది. మరికందరు ముఖ్యమైన అధికారుల బదిలీ కోసం జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టీడీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అధికారుల్ని ఈసీ బదిలీ చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగాన్ని దాటుకుని రాజకీయ పార్టీలు ముందడుగు వేయలేవని పూర్తి అవగాహన చంద్రబాబుకు ఇప్పటికే తెలిసొచ్చింది. 2019లో బీజేపీతో ఘర్షణ వైఖరితో చంద్రబాబు కనీసం సచివాలయంలో సమీక్షలు కూడా నిర్వహించలేకపోయారు. పంట నష్టాలు, రైతుల ఇబ్బందులు, తాగునీటి అవసరాల వంటి సమస్యలపై ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించడానికి కూడా చంద్రబాబుకు ఈసీ అనుమతించలేదు.

గత అనుభవాలతోనే చంద్రబాబు ఈసారి జాగ్రత్తగా వ్యవహరించారు. అధికార యంత్రాంగంతో ఘర్షణ వైఖరి పనికిరాదనే తత్వం బోధపడటంతో పాటు, టీడీపీ వ్యతిరేక వైఖరితో ఉన్న వారి విషయంలో ఫిర్యాదులు చేసింది. మరోవైపు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఈసీకి వరుస ఫిర్యాదులు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి 22మంది ఐపీఎస్‌ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే వారు విధుల్లో ఉంటే సాధ్యం కాదని ఫిర్యాదు చేశారు. పురందేశ్వరి purandeswari ఫిర్యాదు చేసిన 22మందిలో ఐదుగురు ఇప్పటికే పోస్టింగులు కోల్పోయారు.

22మంది ఐపీఎస్‌లపై ఫిర్యాదు..

డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డితో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్సార్ ఆంజనేయులు, డీజీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పివి.సునీల్ కుమార్, సిఐడి ఏడీజీ ఎన్‌.సంజయ్, విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ కొల్లి రఘురామ రెడ్డి, విజయవాడ సీపీ కాంతి రాణా తాతా, గుంటూరు రేంజీ ఐజీ పాలరాజు, వైజాగ్ రేంజీ ఐజీ విశాల్ గున్నీ, కర్నూలు రేంజీ డిఐజి విజయరావు, అనంతపురం డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ అనంతపురం అన్బురాజన్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రిషాంత్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వైజాగ్ జాయింట్ సీపీ ఫకీరప్ప, కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్, కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ రాధికా, నాన్ క్యాడర్ ఎస్పీ ఆనంద్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి purandeswari ఫిర్యాదు చేశారు.

వీరిలో ఐజీ పాలరాజు, ఎస్పీలు జాషువా, రవిశంకర్‌ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలపై ఈసీ ఇప్పటికే వేటు పడింది. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ సహా మరికొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ, బీజేపీ పట్టుబడుతున్నాయి. బీజేపీ ఫిర్యాదులపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించడం మానేశారని, చెల్లి భర్త నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.

వైసీపీ ఆరోపణలు ఎలా, టీడీపీ ఫిర్యాదులు మాటెలా ఉన్నా పెద్ద సంఖ్యలో ఆలిండియా సర్వీస్ అధికారులు రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల వేళ విధుల నుంచి తప్పించడం ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరినట్టు అవుతోంది.

సంబంధిత కథనం