RTC Railway Running Specials : ఓటేసేందుకు సొంతూళ్లకు పోటెత్తిన జనం-రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే అదనపు సర్వీసులు
RTC Railway Running Specials : ఓటేసేందుకు ఓటరన్న పల్లెలకు క్యూకట్టాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా, ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
RTC Railway Running Specials : తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు జనం బయలుదేరారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని స్వగ్రామాలు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్ లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా రద్దీ కనిపిస్తుంది. ఆర్టీసీ, ట్రైన్స్ టికెట్లు దొరకని వాళ్లను ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు దోచేస్తున్నారు. భారీగా టికెట్ రేట్లు పెంచేశారు. ఇక సొంతంగా కార్లలో వచ్చే వాళ్లు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద భారీగా క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తున్నాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి సమయంలో కనిపించే దృశ్యాలు మళ్లీ ఎన్నికల సమయంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ ట్రైన్స్ లో అదనపు బోగీలను జోడిస్తుంది.
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. మే 8 నుంచి 12 తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఒంగోలకు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నం కు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్- బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎస్, జీడిమెట్ల , రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
విజయవాడ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు
ఓట్లు వేసేందుకు గ్రామాలకు వస్తున్న వారితో విజయవాడ బస్ స్టేషన్ రద్దీగా మారింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. బెంగుళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన మొత్తం 323 బస్సులు, 12వ తేదీన 269 బస్సులు నడుపుతున్నారు. రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడుపుతున్నట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అదే విధంగా ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు సిద్ధం చేశామన్నారు.
రైళ్లకు అదనపు బోగీలు, స్పెషల్ ట్రైన్స్
ఓట్ల పండుగకు ఊరెళ్తు వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. రెగ్యులర్, స్పెషల్ ట్రైన్లుకు వెయిటింగ్ లిస్ట్ లు భారీగా ఉన్నాయి. దీంతో రైల్వే అధికారులు మరిన్ని అదనపు రైల్వే సర్వీసులు ప్రకటిస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లను నడపనున్నారు. మే 12న సికింద్రాబాద్ నుంచి విశాఖకు(07097), తిరిగి మే 13న విశాఖ నుంచి సికింద్రాబాద్ కు(07098) సూపర్ ఫాస్ట్ ట్రైన్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు అదనపు రద్దీ క్లియర్ చేసేందుకు పలు రైళ్లకు అదనపు బోగీలు యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అదనపు బోగీల జాబితాను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ లో ప్రకటించింది.
సంబంధిత కథనం