Jagan Attack Case : బోండా ఉమా ఆఫీస్ వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు - ఏం జరగబోతుంది..?-high tension at tdp leader bonda umamaheswara rao office over jagan attack case ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jagan Attack Case : బోండా ఉమా ఆఫీస్ వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు - ఏం జరగబోతుంది..?

Jagan Attack Case : బోండా ఉమా ఆఫీస్ వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు - ఏం జరగబోతుంది..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 19, 2024 09:28 PM IST

Bonda Umamaheswara Rao: టీడీపీ నేత బోండా ఉమా ఆఫీస్ వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగన్ పై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న సమాచారంతోనే వీరంతా చేరుకున్నారని తెలుస్తోంది.

బోండా ఉమా ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం
బోండా ఉమా ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం

Bonda Umamaheswara Rao: ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి(Jagan Attack Case) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సతీశ్ అనే యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు… కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. నిందితుడు సతీశ్ కు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడలోని బోండా ఉమా (Bonda Umamaheswara Rao)సెంట్రల్ కార్యాలయానికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగన్ పై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేస్తున్నారనే అనుమానంతో భారీ సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అక్రమంగా బోండా ఉమాను ఇరికించే యత్నం చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై(YS Jagan Attack Case) జరిగిన దాడి వ్యవహారం మొత్తం టీడీపీ అభ్యర్థి బొండా ఉమా చుట్టూ తిరుగుతుండటంతో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తనను కేసులో ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని బొండా ఉమా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆటోడ్రైవర్ దుర్గారావు… బొండా ఉమా తరపున పార్టీ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉమాను ఇరికిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బొండా ఉమా(Bonda Umamaheswara Rao) అనుచరుడైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బొండా ఉమాకు కూడా ముప్పు ఉంటుందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ నేతలు మాత్రం టీడీపీకి చెందిన నాయకుల ప్రోద్భలంతోనే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిపై దాడిని హేళన చేసేలా వరుసగా ఆ పార్టీ నేతలు ప్రెస్‌ మీట్‌లు పెట్టారని, ఇదంతా పథకం ప్రకారం టీడీపీ నాయకులు చేసిన పనేనని ఆరోపిస్తున్నారు.

ఈ దాడి కేసుపై ఈసీ కూడా ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పోలీసులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో…. శుక్రవారం రాత్రి బోండా ఉమా ఇంటి వద్దకు భారీగా పార్టీ శ్రేణులు చేరుకోవటంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

YS Jagan Attack Case Updates: సీఎం జగన్ పై రాయి దాడి(YS Jagan Attack Case) కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ పుటేజీని పరిశీలించిన తర్వాత… సతీశ్ ను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గురువారం సతీశ్ ను కోర్టులో ప్రవేశపెట్టగా… 17వ తేదీ నిందితుడు సతీశ్ ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. సతీశ్ ఫోన్ కూడా సీజ్ చేశామని తెలిపారు. సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందంటూ ఇందులో ప్రస్తావించారు. ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. డాబా కోట్ల సంటెర్ లో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు. అక్కడ తోపులాట ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. వివేకానంద స్కూల్ పక్కనున్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీశ్ రాయితో దాడి చేశాడని వివరించారు. ఈ కేసులోని ఏ2 ప్రోద్బలంతో సతీశ్ దాడి చేశాడని రాసుకొచ్చారు.

14 రోజుల రిమాండ్…

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు లాయర్ వాదనలు వినిపించారు. పోలీసులు ఇచ్చిన పుట్టినతేదీ వివరాలు.. ఆధార్ లో తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడి ఆధార్ కార్డులో పుట్టినతేదీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు.నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని తెలిపారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించారు. 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని వాదనలు వినిపించారు. అయితే పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ…. దురుద్దేశపూర్వకంగానే రాయితో దాడి చేశారని కోర్టుకు తెలిపారు. హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

WhatsApp channel