CBN And Jagan: ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రాట్లలో కొంత కాలంగా ఓ చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముచ్చటపడి రిషికొండపై నిర్మించుకున్న ఇంట్లోకి అడుగుపెడతారా లేదా అనే చర్చ అధికారుల్లో జోరుగా సాగింది. వారి అంచనాలకు తగ్గట్టే రిషికొండ నివాసంలోకి జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టకుండానే పదవి కోల్పోయారు. ఐదేళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబుకు కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది.
2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఢిల్లీలో చంద్రబాబు ఓ అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి బస కోసం ఏపీ భవన్‌లో ఉన్న వసతి సదుపాయం సరిపోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జన్‌పథ్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం క్వార్టర్ కేటాయించాలని కోరడంతో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నంబర్ 1 జన్‌పథ్ క్వార్టర్‌ను చంద్రబాబుకు కేటాయించింది. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న కేంద్ర మంత్రులకు కేటాయించే టైప్ 7 క్వార్టర్‌ను చంద్రబాబుకు సిపిడబ్ల్యుడి కేటాయించింది.
ఈ క్వార్టర్‌ను తన అభిరుచికి తగినట్టుగా అత్యాధునిక హంగులతో చంద్రబాబు నాయుడు డిజైన్ చేయించారు. టైప్ 7 క్వార్టర్ ఆధునీకీకరణకు దాదాపు ఏపీ ప్రభుత్వం రూ.5కోట్లను ఖర్చు చేసింది. అయితే చంద్రబాబు ఆ క్వార్టర్‌లోకి అడుగు పెట్టకముందే ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల బిజీలో చంద్రబాబు క్వార్టర్‌లోకి ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు.చంద్రబాబుకు ఢిల్లీలో ప్రత్యేకమైన క్వార్టర్‌ను సిద్ధం చేసిన విషయం కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలకు తెలియదు.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకోవడంతో ముచ్చటపడి తయారు చేసుకున్న క్వార్టర్‌కు ఆయన వెళ్లలేకపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక ఆ క్వార్టర్ సంగతి ఒకరిద్దరు ఐఏఎస్‌లకు తప్ప ఎవరికి తెలియదు. చంద్రబాబు ఓడిపోయిన వెంటనే అప్పట్లో ఢిల్లీలో చంద్రబాబు తరపున చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి కొత్త ప్రభుత్వం వద్ద ప్రాపకం కోసం జన్‌పథ్ క్వార్టర్ సమాచారాన్ని జగన్‌కు అందించాడు.
సాధారణంగా ప్రభుత్వాలు మారిన వెంటనే కేంద్ర ప్రభుత్వ క్వార్టర్లను సిపిడబ్ల్యుడి స్వాధీనం చేసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఖర్చుతో రీ మోడల్ చేసిన క్వార్టర్‌ను తిరిగి జగన్‌కు కేటాయించాలని సదరు అధికారి కేంద్రంతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా అధికారికంగా విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు కట్టుకున్న క్వార్టర్ జగన్ వసమైంది. ఆ తర్వాత జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అందులోనే బస చేశారు. జగన్ ఢిల్లీలో లేని సమయంలో ప్రభుత్వంలో పెత్తనం చేసిన కొందరు ముఖ్యమైన అధికారులే అందులో బస చేశారనే ప్రచారం కూడా ఉంది.
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధానిగా మార్చే లక్ష్యంతో రిషికొండలో భారీ నిర్మాణాలు చేపట్టారు. రిషికొండపై ఉన్న పర్యాటక భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించారు. కొత్త భవనాల విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు మూడేళ్లుగా నేడో రేపో జగన్ వైజాగ్ వెళ్లిపోతారని ప్రచారం జరిగినా రకర
కాల కారణాలతో అది నెరవేరలేదు. ఎన్నికల్లో మళ్లీ గెలిచి విశాఖపట్నంలో గృహ ప్రవేశం చేయాలని భావించారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి బస కోసం వసతి సదుపాయలు వెదకాలంటూ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా రిషికొండ భవనాలు అనుకూలంగా ఉంటాయని నివేదిక ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి రిషికొండలో అడుగు పెట్టాలని భావించారు. అనూహ్యంగా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు రిషికొండ భవనాలను టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.
గత కొన్నేళ్లుగా ఎవరిని అడుగు పెట్టనివ్వకుండా ఉంచి రిషికొండ భవనాలపై మంగళవారం ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ జెండాలను ఆ పార్టీ కార్యకర్తలు ఎగురవేశారు. a