EC CEO On Sajjala: కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అలజడి సృష్టిస్తే జైలుకేనని సీఈఓ వార్నింగ్
EC CEO On Sajjala: కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా అలజడి సృష్టించి, గొడవలు పడితే తక్షణం వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
EC CEO On Sajjala: కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల పేరుతో గందరగోళానికి గురయ్యే వారు ఏజెంట్లుగా వద్దని, గట్టిగా నిలబడి నిలదీసే వారిని నియమించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.

కృష్ణాజిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన సీఈఓ సజ్జల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గురువారం మచిలిపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఎన్నికల కౌంటింగ్ రోజు హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, వారి తరపు ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, కౌంటింగ్ అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ జరిగే ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు.
జూన్4న ఏపీలో మద్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు..
ఓట్ల లెక్కింపుకు చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. కృష్ణా యూనివర్సిటీలోని మీడియా సెంటర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలతో కలిసి పరిశీలించారు.
జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ కు సంబంధించి సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం, బారికేడింగ్, సెక్యూరిటీ, సీసీటీవీల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గాల వారీగా 14 టేబుల్ లను సక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు భద్రతా సిబ్బంది పర్యవేక్షణతో పాటు సీసీటీవీల పనితీరు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.
ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ హాల్లో ఎవరైనా అవాంతరాలు లేదా గొడవలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపటం జరుగుతుందని సీఈఓ హెచ్చరించారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి అనుమతులు లేవని, ఈ అంశాలపై జిల్లా ఎస్పీ ఇప్పటికే పలు సమావేశాల ద్వారా పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కలిగించినట్లు గుర్తు చేశారు.
పొరపాట్లకు తావు ఇవ్వొద్దు…
పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగానికి సీఈఓ సూచించారు. భీమవరంలో స్ట్రాంగ్ రూమ్‌లను సీఈఓ తనిఖీ చేశారు. భీమవరంలో సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్ వివరించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని.. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు.