Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!-calculations in telangana on the election results in ap huge bettings ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

HT Telugu Desk HT Telugu

Khammam Bettings: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఎన్నికలు ముగిశాయి. కానీ గెలిచేదెవరో అన్న ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడలేదు. గెలిచి బరిలో నిలిచేదెవరో, ఓడి మూటా ముల్లె సర్దుకుపోయేదెవరో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్ (AFP)

Khammam Bettingsఫ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలపై ఇక్కడ ఆసక్తి అంతంత మాత్రమే. ఇప్పుడు చర్చ అంతా ఆంధ్రా ఎన్నికలపైనే సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఏపీలో ఏం జరగనుంది.? అనే మాటలే వినిపిస్తున్నాయి. కాఫీ కేఫ్ లో, లిక్కర్ బార్లో, టిఫిన్ సెంటర్ లో, భోజనం హోటల్లో ఇలా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఏపీలో సీఎం ఎవరనే చర్చ సర్వ సాధారణంగా మారింది.

కూడికలు, తీసివేతలతో అంచనాలు..

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న చర్చ కామన్ గా మారింది. "వై నాట్ 175" అన్న ముఖ్యమంత్రి జగన్ మాట ఎంత వరకు ఫలిస్తుంది.? జగన్ ను గద్దె దించేందుకు కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల త్రయం ఎంత వరకు సక్సెస్ అవుతుందన్న ప్రశ్నలు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారాయి. మరో వైపు అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతాన్ని దేనికి సంకేతంగా చూడాలి..? అన్న ఉత్కంఠ కొందరికి నిద్ర లేకుండా చేస్తోంది.

నడి రాత్రి 2 గంటల దాకా సాగిన పోలింగ్ ప్రభుత్వానికి చేటు చేస్తుందా..? మేలు చేయనుందా..? పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా లోకం, వృద్ధులు ఎవరికి మద్దతుగా నిలిచారన్న ప్రశ్నలు మరింత ఉత్కంఠకు తెరలేపాయి. ఉప్పొంగిన ఓటరు చైతన్యం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత..? పెరిగిన ఓటింగ్ పెద్ద ఎత్తున ప్రభుత్వ సానుకూలతను తెలియజేస్తుందని అధికార పక్ష నేతలు చెబుతున్నది ఎంత వరకు నిజమవుతుంది..? ఇలాంటి ప్రశ్నలు జనం మెదళ్లను తొలుస్తున్నాయి.

సింహం సింగిల్ అంటూ ఒక్కడే బరిలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా..? మూడు పార్టీల కూటమి గట్టెక్కనుందా..? కూటమి పెద్దగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు తనతో నడిచిన పవన్ కల్యాణ్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత..? మనసు నొచ్చుకున్న జన సైనికులు దేశం అభ్యర్థులకు నిజంగా అండగా నిలిచారా..? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ బలమెంత..? కూటమి గెలుపునకు ఆ బలం సరిపోతుందా..? ఈ మూడు పార్టీల త్రయాన్ని ఏపీ ప్రజలు విశ్వసించారా..? లేక మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఆశీర్వదించనున్నారా..? అనే చర్చ తెలంగాణ జిల్లాలోని ప్రజల మస్తిష్కాలకు పదును పెడుతోంది.

ఇకపోతే ముఖ్యమంత్రిని మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా..? లేక మునుపటిలాగే చతికిలపడతారా..? ఆ స్థానంలో పవన్ పై పోటీ చేసిన వంగా గీత సెంటిమెంట్ డైలాగ్స్ ఎంత వరకు పని చేస్తాయి..? ఆమెను డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటలు అక్కడి ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తాయి..? నిజంగా వంగా గీత గెలిస్తే కూటమి నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి..? ఇప్పటి వరకు అసెంబ్లీ మొత్త తొక్కని పవన్ కు ఈ ఎన్నికలు చావో, రేవో అన్న పరిస్థితిని తెచ్చిన తీరుపై తెలంగాణలో కూడికలు, తీసివేతలతో కూడిన చర్చ జోరుగా సాగుతోంది.

బెట్టింగుల జోరు..

ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ చర్చతో పాటు బెట్టింగుల జోరు కూడా ఊపందుకుంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారన్న అంశంపై తెలంగాణ జిల్లాల్లో బెట్టింగులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మళ్లీ జగనే సీఎం అని కొందరు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని మరికొందరు బెట్టింగులు పెడుతున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా..? లేక బ్యాక్ టు పెవిలియన్ స్టెప్ తీసుకుంటారా.? అనే అంశంపైన కూడా బెట్టింగుల జోరు కొనసాగుతోంది. ఈ బెట్టింగులు వేల నుంచి మొదలుకుని లక్షల్లోకి వెళుతుండడం గమనార్హం. రూ.5 వేల నుంచి మొదకుని వారి స్థాయిని బట్టి రూ.లక్ష వరకు పందేలు కాస్తున్నారు.

ఇంకొందరు పెద్ద ఎత్తున లిక్కర్ పార్టీలు ఇచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు. మరి కొందరైతే వస్తువులను పందెంలో పెడుతున్నారు. విలువైన వాచ్ లు, బైకులను సైతం కొనిచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు. రాజకీయ పిచ్చి మరీ పీక్ స్టేజ్ కి వెళ్లిన కొందరు కార్లు, ఇళ్ల స్థలాలను కూడా పందేలు కాస్తున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఏది ఏమైనా వీరిలో ఎవరు ఏ పందెంలో నెగ్గారో తెలియాలంటే మాత్రం 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.