AP TS Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారాలు, 144 సెక్షన్ అమల్లోకి!-ap ts election campaign ends on may 11th 6pm ec orders ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ts Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారాలు, 144 సెక్షన్ అమల్లోకి!

AP TS Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారాలు, 144 సెక్షన్ అమల్లోకి!

Bandaru Satyaprasad HT Telugu
May 11, 2024 06:15 PM IST

AP TS Election Campaign : ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. వీధుల్లో ఇన్నాళ్లు మారుమోగిన మైకులు మూగబోయాయి.

 తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం

AP TS Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ఇన్నాళ్లు మారుమోగిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలపై ఈసీ నిషేధం విధించింది. సాయంత్రం 6 తర్వాత ఎటువంటి ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో ప్రచారపర్వం ముగిసింది. దీంతో నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు పంపిణీలు మొదలుపెట్టారు. మే 13న ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్

మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందన్నారు. అన్ని చోట్లా రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని ఎంకే మీనా తెలిపారు. అలాగే 6 గంటల తరవాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నించి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయరాదని తెలిపారు. పత్రికల్లో ప్రకటనలు కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలు వెళ్తారన్నారు.

ఓటర్లు ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదు

పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని సీఈవో ఎంకే మీనా తెలిపారు. 13వ తేదీ సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందన్నారు. పోలింగ్ ఎజెంట్ కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామని మీనా తెలిపారు. నియోజకవర్గంలో స్థానికుడైన వ్యక్తి అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్ గా అనుమతి ఇవ్వొచ్చన్నారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లీప్ లు పంచుకోవచ్చన్నారు. అలాగే పోలింగ్ రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశం కాదన్నారు. అయితే ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉందన్నారు. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్ లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు. అలాగే ఆయుధాల తో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్ లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

46 వేల పోలింగ్ కేంద్రాలు

"పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నాం. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. ఒపీనియన్ పోల్, ఎగ్జీట్ పోల్స్ పైనా నిషేధం ఉంది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశాం. అలాగే ప్రైవేటు , ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నాం. ఎన్నికల రోజు హింస జరక్కుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదు. తిరుపతి తరహా ఘటనలు జరక్కుండా నియంత్రిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్దులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం"- సీఈవో ముకేష్ కుమార్ మీనా

సంబంధిత కథనం