Ysrcp : వైసీపీకి మార్పు చెడ్డదైంది- వారసులు, మంత్రులు ఓటమి
Ysrcp : ఏపీ ప్రజలు కనీవినీ ఎరుగని తీర్పు ఇచ్చారు. టీడీపీ కూటమికి ఏకపక్షంగా విజయాన్ని అందించారు. కూటమి ప్రభంజనంలో వైసీపీ వారసులు కొట్టుకుపోయారు.
Ysrcp : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీలో కీలక నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నా...వారిని గెలిపించుకోలేకపోయారు. పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి వంటి కీలక నేతలు ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు బరిలోకి దింపారు. అయితే కూటమి ప్రభంజనంలో వారసులు కొట్టుకుపోయారు.
వారసుల ఓటమి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు ఓటమి పాలయ్యారు. వైసీపీ కీలక నేతలు ఈసారి తమ వారసులను ఎన్నికల బరిలో దింపగా... వారంతా ఓటమి పాలయ్యారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కూమరుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఓటమి పాలైయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి పాలైయ్యారు.
మంత్రులకు ఘోర పరాభవం
2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించగా... ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యేలా కనిపిస్తుంది. జగన్ కేబినెట్‌లోని మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారంతా కూటమి నేతల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ, జోగి రమేశ్, వైసీపీ కీలక నేతలు ఓడిపోయారు. నియోజకవర్గాలు మార్చినా ప్రయోజనం లేకపోయింది.
మార్చిన నేతలంతా ఓటమి
రెండోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి, అభ్యర్థులను మార్చారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. వైసీపీ మార్చిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ ప్రతిపక్షపార్టీ హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది.
సంబంధిత కథనం