AP Election Results: జూన్4 మధ్యాహ్నం 2లోపు తేలనున్న ఏపీ ఎన్నికల ఫలితాలు, సాయంత్రంలోపు పూర్తి ఫలితాలు-ap election results to be announced by 2 pm on june 4 full results by evening ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Election Results: జూన్4 మధ్యాహ్నం 2లోపు తేలనున్న ఏపీ ఎన్నికల ఫలితాలు, సాయంత్రంలోపు పూర్తి ఫలితాలు

AP Election Results: జూన్4 మధ్యాహ్నం 2లోపు తేలనున్న ఏపీ ఎన్నికల ఫలితాలు, సాయంత్రంలోపు పూర్తి ఫలితాలు

Sarath chandra.B HT Telugu
May 30, 2024 05:34 AM IST

AP Election Results: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో జూన్‌ 4వ తేదీ మధ్యాహ్నం రెండులోపు మెజార్టీ అసెంబ్లీ నియోజక వర్గాల ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా
ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఈఓ ముఖేష్‌ కుమార్ మీనా

AP Election Results: జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. 4వ తేదీ రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయి.

మధ్యాహ్నం 2లోపే మెజార్టీ ఫలితాలు…

మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగనుంది. 111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు మరియు మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

పోస్టల్ బ్యాలెట్ కోసం టేబుళ్లను పెంచి సకాలంలో వాటి లెక్కింపును కూడా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రాత్రి 8–9 గంటల లోపు అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఎన్నికల తర్వాత కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఓట్ల లెక్కింపు రోజు ఆయా జిల్లాలో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని మీనా చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను సున్నితమైన ప్రాంతాల్లో నియమించినట్టు ఎన్నికల సంఘానికి వివరించారు.

పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పలు జిల్లాలో తాను పర్యటిస్తూ ఓట్ల లెక్కింపుకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినట్టు మీనా వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్న ఏడీజీపీ బాగ్చి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీ లను అప్రమ్తతం చేశామని చెప్పారు.

ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఫలితాల ప్రకటనలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరిత గతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పార్లమెంటు నియోజక వర్గం, అసెంబ్లీ నియోజక వర్గం వారీగా ఫలితాలు ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి మరియు 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో ECI కి పంపాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించ కుండా ఉండేందుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మార్గ దర్శకాలపై వారికి పూర్తి స్థాయిలో ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవలను వినియోగించుకునే అంశంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించ వద్దన్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించాలన్నారు.

ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ జిల్లాలోని అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి దుర్ఘటనలు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Whats_app_banner

సంబంధిత కథనం