Kolli Raghuram IPS: ఏపీ సిఐడి సిట్ చీఫ్ బదిలీ.. అస్సోంలో ఎన్నికల విధులు అప్పగించిన ఈసీ
Kolli Raghuram IPS: ఏపీ సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ కొల్లిరఘురామిరెడ్డిని ఈసీ బదిలీ చేసింది. అస్సోంలో ఎన్నికల విధులు అప్పగించింది. చంద్రబాబు, లోకేష్‌లపై నమోదైన పలు కేసుల్ని రఘురామిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు ఐపిఎస్‌లపై ఎన్నికల సంఘం Election Commission వేటు వేసింది. తాజాగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని అస్సోంకు బదిలీ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన కొల్లి రఘురామిరెడ్డి పలు కీలక కేసుల్ని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కీలక విధుల్లో ఉన్న IPS అధికారి కొల్లి రఘురామిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. సిట్ అధిపతిగా ఉన్న IPS అధికారి కొల్లి రఘురామిరెడ్డిని అసోంలో పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియామించారు.
అసోంలో ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సీనియర్ IPS అధికారి రఘరామిరెడ్డిని ఈసీ ఆదేశించింది. గౌహతిలో ఉంటూ ఎన్నికలు పూర్తయ్యే వరకు విధులు నిర్వర్తించాలని ఆదేశించింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఐపీఎస్ అధికారిగా పేరున్న రఘురామిరెడ్డిని ఇతర రాష్ట్రానికి బదిలీ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కొల్లి రఘురామిరెడ్డి కీలక పాత్ర పోషించారు. సోమవారం సిట్ కార్యాలయంలో కీలక పత్రాలను దగ్దం చేశారని టీడీపీ ఆరోపించిన కొద్ది గంటలకే ఆయన్ని విధుల నుంచి బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కొల్లి రఘురామిరెడ్డి వ్యవహారశైలిపై టీడీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఫిర్యాదు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన 22మంది అధికారుల్లో కూడా ఆయన ఉన్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందు అన్ని ప్రభుత్వ శాఖల్లో తనిఖీలు చేపట్టడానికి విజిలెన్స్ శాఖకు అధికారులు కట్టబెడుతూ జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదం అయ్యింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ప్రభుత్వం సర్క్యులర్ ఉపసంహరించుకుంది.
ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి సన్నిహితంగా మెలుగుతూ విపక్షాలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ని రాష్ట్రం నుంచి బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోంది.
కొల్లి రఘురామిరెడ్డిని అసోంలో పోలీసు పరిశీలకుడిగా ఈసీ నియమించింది. ఏపీలో ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్‌లు పోస్టింగులు కోల్పోయారు. మరో నలుగురు ఐఏఎస్‌లపై వేటు పడింది. వారిని ఎన్నికల విధుల నుంచి మాత్రమే తప్పించిన ఈసీ కొల్లి రఘురామిరెడ్డిని మాత్రం ఏకంగా అసోం పంపేసింది.
రాష్ట్రానికి దూరంగా... ఈశాన్య రాష్ట్రానికి పరిమితం చేయడం అధికారులు ఉలిక్కి పడ్డారు. టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్న అధికారులు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీ సహా పదిహేను మంది ఐపీఎస్‌లు ఉన్నారు. వారిలో ముఖ్యమైన వారిపై చర్యలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల అక్రమాలను ఈసీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటామని చెబుతున్నారు.
సోమవారం సాయంత్రం రఘురామిరెడ్డిని బదిలీచేస్తూ ఈసీ ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం సమీపంలో దర్యాప్తు పత్రాలను దగ్దం చేయడం రాజకీయ కలకలం రేపింది. అవి కేవలం సరిగా ముద్రణ కాని పత్రాలని రఘురామిరెడ్డి వివరణ ఇచ్చినా దుమారం ఆగలేదు. బదిలీ ఉత్తర్వులు తెలియడంతోనే డాక్యుమెంట్లు తగులబెట్టారని విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పోలీస్ పరిశీలకుల్ని నియమిస్తోంది. రఘురామిరెడ్డిని అసోంలో పది అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలు అప్పగించారు. గౌహతి నుంచి ఆయన విధులు నిర్వర్తిస్తారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లి రఘురామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు.
రాజధాని భూముల వ్యవహారంలో జరిపిన దర్యాప్తుకు నేతృత్వం వహించారు. సిట్‌తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని కూడా ఆయనకు అప్పగించారు. రాజకీయ కక్ష సాధింపులకు ఆయన్ని ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆయన్ని అసోంలో విధులు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఉగాది రాశి ఫలాల కోసం ఈ లింక్ ప్రెస్ చేయండి… https://telugu.hindustantimes.com/topic/ugadi-rasi-phalalu-2024/news
సంబంధిత కథనం