ఐపీఎల్ లో సంచలనం.. చాహల్ హ్యాట్రిక్.. సామ్ కరన్ పోరాటం.. సీఎస్కే స్కోరు ఎంతంటే?-yuzvendra chahal registered firsh hat trick in ipl 2025 sam curran fighting gives csk good total pbks target ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్ లో సంచలనం.. చాహల్ హ్యాట్రిక్.. సామ్ కరన్ పోరాటం.. సీఎస్కే స్కోరు ఎంతంటే?

ఐపీఎల్ లో సంచలనం.. చాహల్ హ్యాట్రిక్.. సామ్ కరన్ పోరాటం.. సీఎస్కే స్కోరు ఎంతంటే?

ఐపీఎల్ 2025లో సంచలనం. పంజాబ్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో సత్తాచాటాడు. మరోవైపు సామ్ కరన్ పోరాటంతో సీఎస్కే మంచి స్కోరే సాధించింది.

హ్యాట్రిక్ తీసిన చాహల్ (Surjeet Yadav)

ఐపీఎల్ 2025లో సీఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఇన్నింగ్స్ లో అటు పరుగులు వచ్చాయి.. ఇటు వికెట్లు పడ్డాయి. సామ్ కరన్ (45 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు. యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తీశాడు.

బుధవారం (ఏప్రిల్ 30) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ చాహల్ ఈ సీజన్ లో ఫస్ట్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో అతనికి ఇది సెకండ్ హ్యాట్రిక్. ఈ మ్యాచ్ లో చాహల్ 4, అర్ష్ దీప్ 2, యాన్సెన్ 2 వికెట్లు తీశారు.

పవర్ ప్లేలోనే మూడు

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే మరోసారి పవర్ ప్లేలో తడబడింది. 6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయింది. గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ మరోసారి ఫెయిలయ్యాడు. 11 పరుగులు చేసిన అతణ్ని.. అర్ష్ దీప్ సింగ్ ఔట్ చేశాడు. మరో కుర్రాడు ఆయుష్ మాత్రె (7), జడేజా (17) నిలబడలేకపోయారు.

కరన్ అదుర్స్

పంజాబ్ బౌలర్ల జోరు చూస్తే మరోసారి హోం గ్రౌండ్ లో సీఎస్కే తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ సామ్ కరన్ సీఎస్కేను ఆదుకున్నాడు. ఫైటింగ్ హాఫ్ సెంచరీతో టీమ్ మెరుగైన స్కోరు చేసేలా చూశాడు. భారీ షాట్లతో చెలరేగాడు. మరో ఎండ్ లో డెవాల్డ్ బ్రేవిస్ (36) కూడా నిలబడ్డాడు. కరన్, బ్రేవిస్ జోడీ నాలుగో వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సిక్సర్ల మోత

సెకండ్ టైమౌట్ తర్వాత ఫస్ట్ బాల్ కే బ్రేవిస్ ను అజ్మతుల్లా ఒమర్ జాయ్ ఔట్ చేశాడు. వికెట్ పడ్డా కరన్ తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సూర్యాన్ష్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు దంచిన కరన్.. మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. 16 ఓవర్లకు 160/4తో నిలిచిన సీఎస్కే.. 200కు పైగా స్కోరు చేస్తుందనిపించింది.

చాహల్ మాయ

లాస్ట్ లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అదరగొట్టింది. 17వ ఓవర్లో అర్ష్ దీప్ 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో సామ్ కరన్ ను ఔట్ చేసిన యాన్సెన్ సీఎస్కేను దెబ్బకొట్టాడు. ఫ్యాన్స్ కేరింతలతో క్రీజులోకి వచ్చిన ధోని ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. కానీ 19వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన చాహల్ మాయ చేశాడు.

హ్యాట్రిక్ ఇలా

19వ ఓవర్లో హ్యాట్రిక్ సహా 4 వికెట్లు పడగొట్టాడు చాహల్. సెకండ్ బాల్ కు ధోనీని పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత 4, 5, 6 బంతుల్లో వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ ను చాహల్ ఔట్ చేశాడు. 6 పరుగులకే లాస్ట్ 5 వికెట్లు కోల్పోయిన సీఎస్కే 190 స్కోరు దగ్గరే ఆగిపోయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం