Yuzvendra Chahal: టీ20 ప్రపంచకప్ భారత జట్టులో 'కుల్చా' జోడీ ఉండనుందా?
T20 World Cup 2024 - Team India: టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‍గా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఫామ్‍ను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో మెగాటోర్నీ ద్వారా చాహల్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడనే అంచనాలు ఉన్నాయి.
T20 World Cup 2024 - Team India: భారత స్టార్ స్పిన్నర్లు కుల్‍దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ జోడీ.. ‘కుల్చా’గా ఫేమస్ అయింది. ఈ ఇద్దరూ కలిసి తమ స్పిన్ మ్యాజిక్‍తో చాలా మ్యాచ్‍ల్లో టీమిండియాను గెలిపించారు. అయితే, కొంతకాలంగా భారత జట్టులో చాహల్‍కు చోటు దక్కడం లేదు. చివరగా గతేడాది వెస్టిండీస్ పర్యటనలో ఆడాడు. ఆ తర్వాత గతేడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‍లో చాహల్‍కు చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమనే వాదనలు వినిపించాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున లెగ్ స్పిన్నర్ చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగాటోర్నీకి ఆటగాళ్ల ఎంపిక కోసం టీమిండియా సెలెక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కసరత్తులు మొదలుపెట్టారు. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ ఫామ్‍ను కూడా పరిశీలిస్తున్నారు. దీంతో యజువేంద్ర చాహల్.. ప్రపంచకప్‍కు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదరగొడుతున్న చాహల్
ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‍ల్లో 11 వికెట్లను దక్కించుకున్నాడు. ప్రస్తుతం కేవలం 7.40 ఎకానమీతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీజన్ పర్పుల్ క్యాప్ చాహల్ వద్దే ఉంది. ఈ సీజన్ అత్యధిక వికెట్ల జాబితా టాప్-10లో ఏకైక స్పిన్నర్‌గా చాహల్ ఉన్నాడు.
ఈ సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో చాహల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కీలక సమయాల్లో ప్రత్యర్థి టీమ్ వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. బ్యాటర్లను కట్టడి చేశాడు.
కుల్చా జోడీ రిపీట్
ఈ ఏడాది ఐపీఎల్ ప్రదర్శనను బట్టి టీ20 ప్రపంచకప్‍లో యజువేంద్ర చాహల్‍కు టీమిండియాలో చోటు దక్కేలా కనిపిస్తోంది. ఈ సీజన్‍లో ఇలానే ప్రదర్శన కొనసాగిస్తే అతడికి ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. మరోవైపు, కొంతకాలంగా అదరగొడుతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. టీ20 వరల్డ్ కప్ టీమిండియాలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ సీజన్‍లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‍లు ఆడిన కుల్దీప్ ఆరు వికెట్లను తీసుకున్నాడు. మొత్తంగా 2024 టీ20 ప్రపంచకప్‍తో టీమిండియాలో కుల్చా జోడీ మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విఫలమవుతున్న బిష్ణోయ్
మరోవైపు, భారత యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ ఐపీఎల్ సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అంతగా రాణించడం లేదు. ఆరు మ్యాచ్‍ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో భారత జట్టులోకి చాహల్ వచ్చే అవకాశాలు బలపడుతున్నాయి. అందులోనూ టీ20 ప్రపంచకప్ జరిగే వెస్టిండీస్ పిచ్‍లు స్లోగా ఉంటాయి. ఇవి చాహల్ బౌలింగ్ స్టైల్‍కు సరిపోతాయి. మరి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మరోవైపు, టీ20 ప్రపంచకప్‍లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా భారత జట్టులో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల్లో ఎవరిని తీసుకోవాలన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్యాటింగ్‍లో దూబే రెచ్చిపోతుంటే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ రాణించలేకపోతున్నాడు. సెలెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారోననే ఉత్కంఠ నెలకొని ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ టోర్నీ సాగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టుపై సెలెక్టర్లు ఈనెలాఖరుకు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది.