భారత క్రికెట్ జట్టు సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల కేసులో బాంబే హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు (మార్చి 20) ఈ విడాకుల పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టుకు ఆర్డర్స్ పాస్ చేసింది. చాహల్, ధనశ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హై కోర్టు విచారణకు స్వీకరించింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి కింద విడాకుల కోసం నిర్దేశించిన ఆరు నెలల కూలింగ్-ఆఫ్ వ్యవధిని రద్దు చేయాలని కోరుతూ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం స్వీకరించింది.
సింగిల్ జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చాహల్ పాల్గొనడాన్ని పరిగణనలోకి తీసుకుని రేపటిలోగా విడాకుల పిటిషన్‌ను నిర్ణయించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించారు.
చాహల్, ధనశ్రీ రెండున్నరేళ్లుగా విడిగానే జీవిస్తున్నారని అంశాన్ని బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే భరణం గురించి ఈ ఇద్దరి మధ్య ఇప్పటికే రాజీ కుదిరిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చాహల్, ధనశ్రీ.. డిసెంబర్ 2020లో వివాహం చేసుకుని, జూన్ 2022లో విడిపోయారు.
పరస్పర అంగీకారం ఆధారంగా విడాకులు కోరుతూ ఫిబ్రవరి 5న కుటుంబ కోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. కానీ కూలింగ్ ఆఫ్ పిరియడ్ ను రద్దు చేయాలనే వీళ్ల పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది.
సెక్షన్ 13బీ(2) ప్రకారం, విడాకుల కోసం పరస్పర పిటిషన్‌ను దాఖలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత మాత్రమే ఫ్యామిలీ కోర్టు పరిగణిస్తుంది. తిరిగి కలుసుకునేందుకు దంపతులకు అవకాశం ఇవ్వడమే ఈ కూలింగ్ ఆఫ్ పిరియడ్ లక్ష్యం. అయితే 2017 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. వివాదం పరిష్కారానికి అవకాశం లేకపోతే ఆ కూలింగ్ ఆఫ్ పిరియడ్ ను రద్దు చేయొచ్చు.
ధనశ్రీ నుంచి విడాకులు కోరుకుంటున్న చాహల్ భరణంగా రూ.4.75 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు. ఇందులో ఇప్పటికే ధనశ్రీకి రూ.2.37 కోట్లు చెల్లించాడని ఫ్యామిలీ కోర్టు తెలిపింది. అయితే కూలింగ్ ఆఫ్ పిరియడ్ ను ఫ్యామిలీ కోర్టు రద్దు చేయకపోవడంతో చాహల్-ధనశ్రీ బాంబే కోర్టును ఆశ్రయించారు. దీనిపై బాంబే హై కోర్టు తాజాగా ఆర్డర్స్ రిలీజ్ చేసింది. రేపటి లోపు దీనిపై తుది తీర్పు వచ్చే అవకాశముంది.
సంబంధిత కథనం