Chahal Dhanashree Verma Divorce: చాహల్ చేసిన పనితో మళ్లీ బలంగా విడాకుల రూమర్స్.. ధనశ్రీతో విడిపోనున్నాడా!
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోనున్నారని మరోసారి రూమర్లు వస్తున్నాయి. చాహల్, ధనశ్రీ తాజాగా చేసిన పనితో ఈ పుకార్లు బలపడ్డాయి. ఆ వివరాలివే..
భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, అతడి భార్య నటి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోనున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, వీరు విడాకులు తీసుకోనున్నారనంటూ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ చేసిన పనితో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అన్‍ఫాలో, ఫొటోలు డిలీట్
ఇన్‍స్టాగ్రామ్‍లో తాజాగా ధనశ్రీ వర్మను యజువేంద్ర చాహల్ అన్‍ఫాలో చేశాడు. అలాగే ఆమెతో ఉన్న ఫొటోలన్నింటినీ ఇన్‍స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేశాడు. దీంతో విడాకుల రూమర్లు బలపడ్డాయి. ధనశ్రీ వర్మ కూడా చాహల్‍ను ఫాలో చేసేశారు. అయితే, ఇంకా అతడితో ఉన్న ఫొటోలను ఆమె డిలీట్ చేయలేదు. , చాహల్ మాత్రం ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తీసేశాడు.
రూమర్లు ఖాయమేనా!
చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోవడం ఖాయమంటూ వాదనలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారంటూ వారికి సంబంధించిన వర్గాలు చెప్పాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. “వారి విడాకులు అనివార్యమే. అధికారికంగా ప్రకటన వచ్చే ముందు చర్యలే ఇవి. వారు విడిపోయేందుకు కచ్చితమైన కారణం ఇంకా తెలియయదు. కానీ వారిద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారనేది స్పష్టం” అని ఆ రిపోర్ట్ పేర్కొంది.
తన పేరులో చాహల్ అనే పదాన్ని ధనశ్రీ వర్మ 2023లోనే తొలగించారు. అప్పటి నుంచి వీరి విడాకులపై రూమర్లు వస్తున్నాయి. కొత్త లైఫ్ లోడింగ్ అవుతోందని అప్పట్లో చాహల్ కూడా ఓ పోస్ట్ పెట్టారు. అయితే, కొంతకాలానికి తాను కలిసే ఉన్నామని చాహల్ వెల్లడించారు. విడాకుల వాదనలను ఖండించారు. అయితే, ఆ తర్వాత కూడా వీరు విడిపోనున్నారని చాలాసార్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు వారు ఇన్‍స్టాగ్రామ్‍లో పరస్పరం అన్‍ఫాలో కావడంతో ఆ వాదనలను మరింత బలం చేకూరింది.
చాహల్, ధనశ్రీ ప్రేమ కథ, పెళ్లి
కరోనా లాక్‍డౌన్ సమయంలో యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ పరిచయం ఏర్పడింది. ఈ విషయాలను ధనశ్రీ గతంలో చెప్పారు. అప్పట్లో మ్యాచ్‍లేమీ లేకపోవడంతో చాహల్ ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ వీడియోలు చూసి ఆమెను సంప్రదించాడు. దీంతో ఆన్‍లైన్‍లోనే చాహల్‍కు డ్యాన్స్ నేర్పారు ధనశ్రీ. ఇలా ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో చాహల్, ధనశ్రీ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2023 నుంచి వీరి విడాకుల రూమర్లు చక్కర్లు కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరింత బలంగా మారాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
మరోవైపు యజువేంద్ర చాహల్‍కు కొంతకాలంగా భారత జట్టులో చోటు దక్కడం లేదు. టీమిండియా తరఫున చివరిగా ఆగస్టు 2023లో ఆడాడు. అయితే, 2025 ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో చాహల్‍కు భారీ ధర దక్కింది. రూ.18కోట్లకు అతడిని పంజాబ్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన స్పిన్నర్‌గా అతడు రికార్డు దక్కించుకున్నాడు.
సంబంధిత కథనం