Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఆల్ టైమ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. కానీ అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకూ తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ కంటే ఎక్కువగా బౌలింగ్ పైనే దృష్టి సారిస్తున్న అర్జున్ ను తాను ఆరు నెలల్లోనే ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా మారుస్తానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అనడం విశేషం.
యోగ్‌రాజ్ సింగ్ ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ.. అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్ పై దృష్టి సారించి తన టాలెంట్ ను వృథా చేసుకుంటున్నాడని, అతనికి అత్యుత్తమ బ్యాటర్ అయ్యే సామర్థ్యం ఉందని అన్నాడు. తన దగ్గరికి కోచింగ్ కు వస్తే అర్జున్ ను ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ గా మారుస్తానని స్పష్టం చేశాడు. నిజానికి గోవా రంజీ టీమ్ లో చేరే ముందు కొన్నాళ్ల పాటు యోగ్‌రాజ్ దగ్గర అర్జున్ శిక్షణ తీసుకున్నాడు.
గోవా తరఫున అతడు సెంచరీ కూడా చేశాడు. దీనిద్వారా తాను సచిన్, యువరాజ్ లను తప్పని నిరూపించినట్లు కూడా ఈ సందర్భంగా యోగ్‌రాజ్ చెప్పాడు. వాళ్లు అతన్ని ఓ బౌలింగ్ ఆల్ రౌండర్ గా చూస్తుంటే.. తాను మాత్రం అర్జున్ ఓ బ్యాటింగ్ ఆల్ రౌండర్ అని నమ్ముతున్నట్లు చెప్పాడు.
“ఒకవేళ అర్జున్ నా దగ్గరికి వస్తే.. అతన్ని కేవలం ఆరు నెలల్లోనే ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ గా మారుస్తా. బ్యాట్ తో అతని సామర్థ్యం ఎంతో ఎవరికీ తెలియదు. అతడు నాతో 12 రోజులు ఉన్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీ చేశాడు” అని తరువర్ కోహ్లి యూట్యూబ్ ఛానెల్లో యోగ్‌రాజ్ అన్నాడు. అతడో గొప్ప బ్యాటర్ అని, అతన్ని ఓ బౌలింగ్ ఆల్ రౌండర్ గా చేసి ఎందుకు టాలెంట్ వృథా చేస్తున్నారని తాను సచిన్, యువరాజ్ లతో అన్నట్లు యోగ్‌రాజ్ చెప్పాడు.
అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తో ఉన్నాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం దక్కడం లేదు. ఇప్పటి వరకూ అతడు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు 532 రన్స్ చేశాడు. 37 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం 5 మ్యాచ్ లే ఆడాడు. అందులో 13 రన్స్ చేసి, 3 వికెట్లు తీశాడు. 2021 నుంచి అతడు ముంబై టీమ్ తోనే ఉన్నాడు. గతేడాది మెగా వేలంలో అర్జున్ ను రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం