Yuvraj Singh All Time Playing XI: యువరాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ లెవన్ ఇదే.. కనిపించని ధోనీ.. ముగ్గురు ఇండియన్స్‌కు చోటు
Yuvraj Singh All Time Playing XI: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవన్ టీమ్ ఏదో చెప్పాడు. అందులో ముగ్గురు ఇండియన్స్ కు చోటు దక్కగా.. ధోనీ పేరు లేకపోవడం గమనార్హం.
Yuvraj Singh All Time Playing XI: టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవన్ జట్టును అనౌన్స్ చేశాడు. ఆదివారం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ను ఇండియా ఛాంపియన్స్ ఓడించిన తర్వాత యువీ మాట్లాడాడు.
నలుగురు ఆస్ట్రేలియన్లు.. ముగ్గురు ఇండియన్స్..
పాకిస్థాన్ ఛాంపియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్లతో గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ టీమ్ కు యువరాజ్ సింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత యువీ తన ఆల్ టైమ్ టీమ్ గురించి మాట్లాడాడు. అతని జట్టులో టీమిండియా ఇప్పటి తరం లెజెండ్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు చోటు దక్కినా.. ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మాత్రం కనిపించలేదు.
మొత్తంగా ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. నలుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్, ఒక సౌతాఫ్రికా ప్లేయర్, ఒక పాకిస్థాన్ ప్లేయర్, ఒక శ్రీలంక ప్లేయర్, ఒక ఇంగ్లండ్ ప్లేయర్ కు కూడా చోటు దక్కింది. 2007 టీ20 వరల్డ్ కప్ ఎవరితో గొడవ తర్వాత తాను ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టాడో ఆ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా యువీ జట్టులో ఉండటం విశేషం.
యువీ టీమ్ ఇదే..
యువీ జట్టులో ఎవరున్నారంటే.. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, వసీం అక్రమ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్‌గ్రాత్ పేర్లను యువరాజ్ చెప్పాడు. రోహిత్, కోహ్లి తప్ప మిగిలిన ప్లేయర్స్ అందరూ ఇప్పటికే రిటైరైన వాళ్లు.
ఇక యువరాజ్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ 1990, 2000ల్లో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వాళ్లే. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సచిన్ టెండూల్కర్, పాంటింగ్, షేన్ వార్న్, మురళీధరన్, మెక్‌గ్రాత్ లాంటి ప్లేయర్స్ అతని జట్టులో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ వన్డే, టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగుల వీరుడిగా సచిన్ కొనసాగుతున్నాడు.
ఇక అతడు ఆడే సమయంలో సచిన్ రికార్డులను సవాలు చేస్తూ గట్టి పోటీ ఇచ్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విధ్వంసక వికెట్ కీపర్ గా పేరుగాంచిన గిల్‌క్రిస్ట్ లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు (800) సాధించిన మురళీధరన్.. బాల్ ఆఫ్ ద సెంచరీ వేసిన షేన్ వార్న్.. పాకిస్థాన్ గొప్ప ఆల్ రౌండర్ వసీం అక్రమ్.. ఇలా యువీ జట్టులో అందరూ లెజెండరీ క్రికెటర్లే ఉన్నారు.
ఇలాంటి ప్లేయర్స్ మధ్య ఆధునిక క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యువీ చోటివ్వడం నిజంగా విశేషమే. ఈ ఇద్దరు ప్లేయర్స్ సుమారు 15 ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ కు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అయితే ఇండియాకు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ధోనీ పేరును యువీ మరచిపోవడమే అతని అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయం.