Mohammed Shami: ‘అందులో బాధపడాల్సింది ఏముంది’: గట్టి సమాధానం ఇచ్చిన మహమ్మద్ షమీ
Mohammed Shami: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత పేసర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.
Mohammed Shami: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సత్తాచాటాడు. ఫ్లాట్ పిచ్‍పై కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. మొహాలీ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‍లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో ముందంజ వేసింది భారత్. ఇటీవల మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తుండటంతో మహమ్మద్ షమీకి భారత తుదిజట్టులో ప్రతీ మ్యాచ్‍లో చోటు దక్కడం లేదు. జట్టు కూర్పు సమీకరణాల వల్ల షమీ కొన్నిసార్లు బెంచ్‍కే పరిమితం కావాల్సి వస్తోంది. ఆసీస్‍తో తొలి రెండు వన్డేలకు సిరాజ్‍కు సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వగా.. తొలి మ్యాచ్‍లో షమీ ఆడాడు. ఈ తరుణంలో తొలి వన్డే గెలుపు తర్వాత మహమ్మద్ షమీ.. మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టీమ్‍తో ఉన్నా తుదిజట్టులో చోటు దక్కని సమయాల్లో బాధగా అనిపిస్తుందా అని షమీకి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు గట్టి సమాధానం చెప్పాడు.
తాను రెగ్యులర్‌గా ఆడితే.. ఎవరో ఒకరు బెంచ్‍కు పరిమితం కావాల్సి ఉంటుందని కదా అని షమీ అన్నాడు. జట్టు గెలుస్తుందన్నప్పుడు పక్కన కూర్చోవడానికి బాధ పడాల్సిన అవసరం ఏముందని చెప్పాడు. తుదిజట్టులో చోటు దక్కకపోతే తాను చిన్నబుచ్చుకోనని స్పష్టం చేశాడు. “ఒకవేళ జట్టులో చోటు దక్కి అడితే మంచిది.. తుది జట్టులో ఆడే అవకాశం రాకుంటే.. ఆడే వారికి మద్దతుగా నిలవాలి. దాంట్లో బాధపడాల్సిన, చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. జట్టు ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వర్తించేందుకు రెడీగా ఉన్నా” అని షమీ చెప్పాడు.
రొటేషన్ పద్ధతికి అంగీకరించారా అనే ప్రశ్న కూడా షమీకి ఎదురైంది. ఇది తన పరిధిలో లేని విషయమని షమీ సమాధానం ఇచ్చాడు. “మీరు తెలుసుకోవాలనుకుంటున్నది నా పరిధిలో లేని విషయం. జట్టును అంచనా వేసేందుకు.. ఆ పరిస్థితులను బట్టి కోచ్ ఆటగాళ్లను రోటేట్ చేస్తుంటారు” అని షమీ చెప్పాడు.
వన్డే ప్రపంచకప్‍కు ముందు సిరీస్ కావడంతో విభిన్నమైన కాంబినేషన్లను ప్రయత్నించేందుకు ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్‍దీప్ యాదవ్‍కు రెస్ట్ ఇచ్చారు టీమిండియా సెలెక్టర్లు. దీంతో ఈ రెండు వన్డేల్లో కొత్త కాంబినేషన్లను ప్రయోగిస్తోంది టీమిండియా మేనేజ్‍మెంట్. కాగా, మూడో వన్డేకు ఆ ఐదుగురు తిరిగిరానున్నారు. భారత్, ఆసీస్ మధ్య రెండో వన్డే ఆదివారం (సెప్టెంబర్ 24) జరగనుంది.