Yashasvi Jaiswal: వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలతో చెలరేగిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అతడు అలా ఆడటంలో క్రెడిట్ తమకే దక్కుతుందని డకెట్ అన్నాడు. దీనిపై తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది సరైన పద్ధతి కాదంటూ డకెట్ కు క్లాస్ పీకాడు.
రాజ్‌కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ కూడా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత యశస్వి అంతకంటే ఎక్కువే చెలరేగి ఏకంగా 12 సిక్స్ లతో డబుల్ సెంచరీ చేయడంతో ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని, తమ స్టైల్ చూసే యశస్వి అలా ఆడుతున్నాడని డకెట్ అన్నాడు. ఈ కామెంట్స్ పై నాసిర్ హుస్సేన్ స్పందించాడు.
"జైస్వాల్ తమ నుంచి నేర్చుకున్నాడన్న కామెంట్ పై నేను స్పందిచాలనుకున్నాను. అతడు మీ నుంచి నేర్చుకోలేదు. అతడు తాను ఎదిగిన క్రమం నుంచి, అలా ఎదగడానికి పడిన శ్రమ నుంచి, ఐపీఎల్ నుంచి నేర్చుకున్నాడు. మీరే అతని నుంచి నేర్చుకోవాలి. వాళ్లు బయట, డ్రెస్సింగ్ రూమ్ లో చేస్తున్న కామెంట్స్ పై ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఆ కుర్రాడిని చూసి మనం నేర్చుకోవాలి. లేదంటే అది తప్పవుతుంది. బజ్‌బాల్ ను అసలు విమర్శించకూడదు అంటే కుదరదు. ఎప్పుడైనా నేర్చుకోవడానికి, మెరుగవడానికి అవకాశం ఉంటుంది" అని నాసిర్ హుస్సేన్ స్పష్టం చేశాడు.
మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా తమ ప్లేయర్స్ కు క్లాస్ పీకాడు. మాటలు కట్టిపెట్టండని అన్నాడు. "వాళ్ల మాటలు వినండి. వైజాగ్ లో 600 అయినా చేజ్ చేస్తామని జిమ్మీ ఆండర్సన్ అన్నాడు. ఇక్కడ ఎంత టార్గెట్ అయితే తమకు అంత మంచిదని బెన్ డకెట్ అన్నాడు. 434 పరుగులతో ఓడారు.
అంతేకాదు యశస్వి ఆడిన తీరుకు తమకు క్రెడిట్ ఇవ్వాలని కూడా అతడు అన్నాడు. ఇలాంటి అటాకింగ్ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఆడలేదన్నట్లుగా అతని మాటలు ఉన్నాయి. డ్రా కోసం ఆడమన్నట్లుగా వాళ్లు మాట్లాడుతున్నారు కానీ ఇది టెస్ట్ క్రికెట్ కు అగౌరవం" అని వాన్ అభిప్రాయపడ్డాడు.
రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకెట్ 151 బంతుల్లోనే 153 రన్స్ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో యశస్వి కూడా 236 బంతుల్లోనే 214 రన్స్ చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 12 సిక్స్ లు ఉన్నాయి. దీంతో అతడు కూడా తమను చూసే బజ్‌బాల్ స్టైల్ కాపీ కొట్టాడన్నట్లు డకెట్ మాట్లాడాడు. దీనిని ఇంగ్లండ్ మాజీలే తప్పుబట్టడం గమనార్హం. ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉండగా.. నాలుగో టెస్టు శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి రాంచీలో జరగనుంది.