Yashasvi Jaiswal Sixes Record: 16 ఏళ్ల కిందటి సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. 5 టెస్టుల్లోనే ఈ ఘనత
Yashasvi Jaiswal Sixes Record: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల కిందట క్రియేట్ చేసిన రికార్డును యశస్వి జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఒక కేలండర్ ఏడాదిలో అత్యధిక సిక్స్ ల రికార్డు ఇది.
Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్ లో యశస్వి జైస్వాల్ తన టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ అతడు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి.. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల కిందట నెలకొల్పిన ఓ రికార్డును సునాయాసంగా బ్రేక్ చేశాడు.
సెహ్వాగ్ 14 టెస్టులు.. యశస్వి 5 టెస్టులు
టెస్ట్ క్రికెట్ లోనూ విధ్వంసం సృష్టించే బ్యాటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కు పేరుంది. అలాంటి డాషింగ్ ఓపెనర్ రికార్డును కూడా యశస్వి చాలా సింపుల్ గా బ్రేక్ చేసేశాడు. 16 ఏళ్ల కిందట అంటే 2008లో ఇండియా తరఫున ఒకే కేలండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డును సెహ్వాగ్ క్రియేట్ చేశాడు. ఆ ఏడాది సెహ్వాగ్ 14 టెస్టుల్లో 22 సిక్స్ లు బాదాడు.
కానీ తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ మాత్రం తాను ఆడుతున్న ఐదో టెస్టులోనే 23వ సిక్స్ బాది సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరూకి 14 టెస్టులు, 27 ఇన్నింగ్స్ అవసరం కాగా.. యశస్వి మాత్రం ఈ ఏడాది కేవలం ఐదో టెస్టులోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో రిషబ్ పంత్ 21 సిక్స్ లతో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (19 సిక్స్ లు, 2019), మయాంక్ అగర్వాల్ (18 సిక్స్ లు, 2019) ఉన్నారు. తాజా ఇన్నింగ్స్ లో యశస్వి.. 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ తో 73 రన్స్ చేశాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ తో యశస్వి ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
టాప్ ఫామ్‌లో యశస్వి
ఇంగ్లండ్ తో సిరీస్ లో అత్యంత నిలకడగా ఆడుతున్న టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లి, వినోద్ కాంబ్లీ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన మూడో ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. రాజ్‌కోట్ డబుల్ సెంచరీలో యశస్వి 12 సిక్స్ లు బాదడం విశేషం.
ఇప్పటికే ఇంగ్లండ్ సిరీస్ లో 600కుపైగా రన్స్ చేశాడు యశస్వి. ఒక ద్వైపాక్షిక సిరీస్ లో ఇండియా తరఫున 700కుపైగా రన్స్ చేసిన ఏకైక బ్యాటర్ గా ఉన్న సునీల్ గవాస్కర్ రికార్డుపై కూడా యశస్వి కన్నేశాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ తోపాటు ఐదో టెస్ట్ కూడా ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో అది సాధ్యం కావచ్చు. యశస్వి ఈ సిరీస్ లో 7 ఇన్నింగ్స్ లో ఏకంగా 103 సగటుతో 618 రన్స్ చేశాడు.
రెండో స్థానంలో ఉన్న బెన్ డకెట్ చేసిన పరుగులు 299 మాత్రమే. అంటే అందులో సగం కూడా లేవు. దీనినిబట్టి యశస్వి ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా యశస్వి ఏడు టెస్టుల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ఈ మూడు సెంచరీలు కూడా 150కిపైగానే కావడం విశేషం.