WPL 2025: ఫైనల్‍లో పరాజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కన్నీరు.. ఆల్‍రౌండ్ షోతో అదరగొట్టినా ఓడటంతో ఎమోషనల్
WPL 2025 Final MI vs DC: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. టైటిల్ చేజారటంతో ఓ ప్లేయర్ కన్నీరు పెట్టుకున్నారు. ఫైనల్‍లో ఆల్‍రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన జట్టు ఓడిపోవటంతో ఎమోషనల్ అయ్యారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఇప్పటి వరకు డబ్ల్యూపీఎల్ మూడు సీజన్లు జరుగగా.. మూడుసార్లు తుదిపోరు చేరినా.. ఒక్కసారి కూడా ఢిల్లీ టైటిల్ సాధించలేకపోయింది. ముంబై బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శనివారం (మార్చి 16) జరిగిన డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్‍లో 8 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. మరోసారి టైటిల్ చేజార్చుకుంది. దీంతో ఢిల్లీ తరఫున ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‍రౌండర్ మరిజానే కాప్ ఎమోషనల్ అయ్యారు.
ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కాప్
ముంబైతో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కాప్ ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. బౌలింగ్‍లో.. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. హేలే మాథ్యూస్, యస్తికా బిస్త్ వికెట్లు తీసి ఢిల్లీకి మంచి ఆరంభం ఇచ్చారు. బ్యాటింగ్‍లోనూ కాప్ అదరగొట్టారు. లక్ష్యఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి 26 బంతుల్లోనే 40 పరుగులు చేశారు. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో దుమ్మురేపారు. ఢిల్లీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడారు. కానీ 18వ ఓవర్లో ఔట్ అయ్యారు. మొత్తంగా డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్‍లో 8 పరుగుల స్వల్ప తేడాతో మెగా ల్యానింగ్ సారథ్యంలోని ఢిల్లీ ఓటమి పాలైంది.
కన్నీరు పెట్టిన కాప్
ఆల్‍రౌండ్ ప్రదర్శన చేసినా ఫైనల్‍లో ఢిల్లీ ఓటమి పాలవటంతో మరిజానే కాప్ కన్నీరు పెట్టుకున్నారు. పరాజయం తర్వాత మైదానంలోనే ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ఓడిపోయినా.. కాప్ పోరాటం మాత్రం అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో రాణించిన తర్వాత జట్టు ఫైనల్‍లో ఓడిపోతే చాలా బాధ ఉంటుందని రాసుకొస్తున్నారు.
హర్మన్‍ను కౌగిలించుకున్న నీతా అంబానీ
రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. ఫైనల్‍లో గెలుపు తర్వాత ముంబై ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. హర్మన్ ప్రీత్‍ను ముంబై ఓనర్ నీతా అంబానీ కౌగిలించుకున్నారు.
డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ 44 బంతుల్లో 66 పరుగులు చేసి అర్ధ శతకంతో అదరగొట్టారు. లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసి ఓటమి పాలైంది. చివర్లో మారిజానే కాప్ (40)తో పాటు నికీ ప్రసాద్ (25 నాటౌట్) రాణించటంతో ఢిల్లీ గెలుస్తుందనేలా కనిపించింది. అయితే, తడబడి ఓటమి పాలైంది.
సంబంధిత కథనం