డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ముంబయి ఇండియన్స్ రెండోసారి టైటిల్ దక్కించుకుంది. 2023లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబయి.. 2025లోనూ ట్రోఫీని సొంతం చేసుకుంది. శనివారం (మార్చి 15) ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ 8 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. అటు ముంబయి విన్నింగ్స్ మూమెంట్స్.. ఇటు ఢిల్లీ కన్నీళ్లతో మైదానంలో మిక్స్ డ్ ఎమోషన్స్ కనిపించాయి.
డబ్ల్యూపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ప్లేయర్స్ ఆనందంలో ఎగిరి గంతులేశారు. మైదానంలో కేరింతలతో పరుగులెత్తారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్.. ఆ ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీని గట్టిగా హగ్ చేసుకోవడం వైరల్ గా మారింది. ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించింది. 44 బంతుల్లో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో రెండో సారి టైటిల్ గెలవడంతో ముంబయి ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ టీమ్, ఫ్యాన్స్ కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ నిచ్చింది. ఓనర్ నీతా అంబానీని హగ్ చేసుకుంది. మొదట ముంబయి బ్యాటింగ్ లో మెరిసిన నాట్ సీవర్ ను కూడా నీతా కౌగిలించుకున్నారు.
డబ్ల్యూపీఎల్ లో టైటిల్ కొట్టాలనే ఢిల్లీ క్యాపిటల్స్ కల మరోసారి కలగానే మిగిలింది. సీజన్ ఆరంభమైన 2023 నుంచి ఆ టీమ్ ఫైనల్ చేరడం రన్నరప్ గా నిలవడం ఓ ట్రెడిషన్ గా మారింది. 2023 ఫైనల్లో ముంబయి చేతిలోనే ఓడిన ఢిల్లీ.. 2024లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు వరుసగా మూడో ఫైనల్లోనూ చిత్తయింది. మళ్లీ ముంబయి ముందు తలవంచింది. దీంతో ఢిల్లీ ప్లేయర్స్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మరీన్ కాప్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎమోషన్ లో ఏడుస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలి వర్మ, జెమీమా తదితర క్రికెటర్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. వరుసగా మూడు సీజన్లలోనూ ఫైనల్లో ఓటమి బాధను తట్టుకోలేకపోయారు. మరీన్ ను సహచర ప్లేయర్స్ ఓదార్చారు. ఆమె వరుసగా రెండు ఫైనల్స్ లో ఓడిన ఢిల్లీ జట్టులో ఉంది.
డబ్ల్యూపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు మొదట ఢిల్లీ చెలరేగి ఆడుతుంది. లీగ్ స్టేజీల్ నంబర్ వన్ గా నిలిచి నేరుగా ఫైనల్ చేరుతుంది. కానీ టైటిల్ పోరులో మాత్రం తలవంచుతుంది.
సంబంధిత కథనం