WPL 2025 Final: హర్మన్, సీవర్ అదుర్స్.. ముంబయిదే టైటిల్.. రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ సొంతం.. ఢిల్లీకి మళ్లీ నిరాశే-wpl 2025 champion mumbai indians second title for team defeated delhi capitals in final harman preeth nat sciver ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2025 Final: హర్మన్, సీవర్ అదుర్స్.. ముంబయిదే టైటిల్.. రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ సొంతం.. ఢిల్లీకి మళ్లీ నిరాశే

WPL 2025 Final: హర్మన్, సీవర్ అదుర్స్.. ముంబయిదే టైటిల్.. రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ సొంతం.. ఢిల్లీకి మళ్లీ నిరాశే

WPL 2025 Final: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. శనివారం ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి రెండో సారి టైటిల్ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ మూడు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఢిల్లీకి మరోసారి నిరాశ తప్పలేదు.

డబ్ల్యూపీఎల్ 2025 ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (AFP)

డబ్ల్యూపీఎల్ 2025 ఛాంపియన్ మంబయి ఇండియన్స్. శనివారం (మార్చి 15) ముంబయిలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 149/7 స్కోరు సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ (66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఢిల్లీ బౌలర్లలో ఆంధ్ర అమ్మాయి శ్రీ చరణి, జొనాసెన్, మరీన్ కాప్ తలా రెండు వికెట్లు తీశారు.

ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసింది. మరీన్ కాప్ (40), జెమీమా (30) మాత్రమే కాస్త పోరాడారు. ముంబయి బౌలర్లలో నాట్ సీవర్ 3, అమేలియా కెర్ 2 వికెట్లు పడగొట్టారు. ముంబయి ఇండియన్స్ కు ఇది రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్. 2023లోనూ ఆ టీమ్ ఛాంపియన్ గా నిలిచింది.

ఆరంభంలోనే షాక్

డబ్ల్యూపీఎల్ 2025 ఫైనల్లో ముంబయి ఇండియన్స్ పై ఛేజింగ్ లో ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ముంబయిని ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశామనే ఆనందం త్వరగానే ఆవిరైంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (13), షెఫాలి వర్మ (4) ఫాస్ట్ గా వచ్చిన దారిలోనే పెవిలియన్ వెళ్లిపోయారు. జెస్ జొనాసెన్ (13) కూడా ఔటైపోయింది. ముంబయి బౌలర్ల ధాటికి ఢిల్లీ 37/3తో కష్టాల్లో పడింది.

పట్టు విడవకుండా

ఢిల్లీని కట్టడి చేసే ఛాన్స్ ను ముంబయి వదులుకోలేదు. వరుసగా వికెట్లు తీసింది. అనాబెల్ (2)ను ఇషాక్ ఔట్ చేసింది. జెమీమా (30) పోరాాటానికి అమేలియా తెరదించింది. 83/6 తో ఢిల్లీ ఓటమి ఖాయమనిపించింది. ఆ దశలో మరీన్ కాప్ (40), నికీ ప్రసాద్ (25 నాటౌట్) పోరాటం ఢిల్లీకి కాస్త ఆశలు కలిగించింది.

ఉత్కంఠ రేపి

ఢిల్లీ ఛేజింగ్ లో ఆఖరి ఓవర్లలో ఉత్కంఠ నెలకొంది. ఇషాక్ వేసిన 16వ ఓవర్లో మరీన్ వరుసగా 4, 6, 4 బాదేసింది. ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. సమీకరణం 24 బంతుల్లో 35 పరుగులుగా మారింది. కానీ ఆ తర్వాతి ఓవర్లో షబ్నిమ్ 6 పరుగులే ఇచ్చింది. 18వ ఓవర్లో నాట్ సీవర్ అద్భుతమే చేసింది. వరుస బంతుల్లో మరీన్ తో పాటు శిఖా పాండే (0)ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పింది. నికీ ప్రసాద్ చివరి వరకూ ఉన్నా సంచలనమేమీ చేయలేకపోయింది.

కెప్టెన్ పోరాటం

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆదుకుంది. కెప్టెన్ పోరాటంతో ముంబయి పోరాడే స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు యాస్తిక (8), హేలీ మాథ్యూస్ (3) త్వరగానే పెవిలియన్ చేరారు. వీళ్లిద్దరినీ మరీన్ కాప్ ఔట్ చేసింది. 14కే రెండు వికెట్లు పడ్డ దశలో నాట్ సీవర్ (30)తో కలిసి హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నిర్మించింది. 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో హర్మన్ ప్రీత్ 66 పరుగులు చేసింది.

మధ్యలో బ్రేక్

హర్మన్ ప్రీత్, నాట్ సీవర్ (30) పోరాటంతో ముంబయి కోలుకునేలా కనిపించింది. ముఖ్యంగా హర్మన్ చక్కటి షాట్లతో అలరించింది. మంచి టైమింగ్ తో బౌండరీలు రాబట్టింది. 103/2తో ముంబయి పటిష్ట స్ఠితిలో నిలిచింది. కానీ తెలుగమ్మాయి శ్రీ చరణి.. నాట్ సీవర్ ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. ఆ వెంటనే టపటపా మూడు వికెట్లు పడ్డాయి. హర్మన్ ప్రీత్ ను సదర్లాండ్ వెనక్కి పంపింది. కానీ చివర్లో అమన్ జోత్ (14 నాటౌట్), సంస్క్రతి (8 నాటౌట్) కలిసి జట్టు స్కోరును 150 కి చేరువ చేశారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం