WPL 2024 RCB vs MI: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. విజృంభించిన పెర్రీ.. ముంబైపై ఘన విజయం-wpl 2024 rcb vs mi royal challengers bangalore reaches playoffs after win against mumbai indians ellyse perry all round ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024 Rcb Vs Mi: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. విజృంభించిన పెర్రీ.. ముంబైపై ఘన విజయం

WPL 2024 RCB vs MI: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. విజృంభించిన పెర్రీ.. ముంబైపై ఘన విజయం

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 12, 2024 11:25 PM IST

WPL 2024 RCB vs MI: డబ్ల్యూపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు రాయల్ చాలెెంజర్స్ బెంగళూరు చేరుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుపై భారీ విజయంతో స్మృతి మంధాన సేన అదరగొట్టింది. ఎలీస్ పెర్రీ ఆల్ రౌండ్ షోతో దుమ్మురేపారు.

WPL 2024 RCB vs MI: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. విజృంభించిన పెర్రీ.. ముంబైపై ఘన విజయం
WPL 2024 RCB vs MI: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. విజృంభించిన పెర్రీ.. ముంబైపై ఘన విజయం (PTI)

WPL 2024 RCB vs MI: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. కీలకమైన మ్యాచ్‍లో అద్భుత ఆట తీరు కనబరిచి ప్లేఆఫ్స్ చేరుకుంది. డబ్ల్యూపీఎల్ 2024లో ఢిల్లీ వేదికగా నేడు (మార్చి 12) జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‍లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (MI) జట్టుపై ఘన విజయం సాధించింది. 30 బంతులు మిగిల్చి మరీ గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

పెర్రీ విజృంభణతో ముంబై ఢమాల్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ఎలీస్ పెర్రీ విజృంభించి ఆరు వికెట్లతో దుమ్మురేపారు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి ఆరుగురిని ఔట్ చేశారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు కుప్పకూలింది. 19 ఓవర్లలో 113 పరుగులకు ముంబై ఆలౌటైంది. తొలి ఆరు వికెట్లను పెర్రీనే పడగొట్టారు. ముంబై కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ (0)ను బౌల్డ్ చేశారు. సజీవన్ సంజన (30), హేలీ మాథ్యూస్ (29) మినహా మిగిలిన ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

బ్యాట్‍తోనూ రాణించిన పెర్రీ

స్వల్వ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది బెంగళూరు. కెప్టెన్ స్మృతి మంధాన (11), సోఫీ మోలినెక్స్ (9) త్వరగానే ఔటైనా.. ఎలీస్ పెర్రీ (40 నాటౌట్) అదరగొట్టారు. బంతితో చెలరేగిన ఈ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‍తోనూ రాణించారు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. భారత స్టార్ రిచా ఘోష్ (36 నాటౌట్) దూకుడుగా ఆడారు. మొత్తంగా పెర్రీ, రిచా బెంగళూరును సేఫ్‍గా గెలుపు తీరం దాటించారు. 15 ఓవర్లలోనే 3 వికెట్లకు 115 రన్స్ చేసి విజయం సాధించింది బెంగళూరు.

రికార్డు సృష్టించిన పెర్రీ

అద్భుత బౌలింగ్‍తో అదరగొట్టిన బెంగళూరు ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ రికార్డు సృష్టించారు. డబ్ల్యూపీఎల్‍లో తొలిసారి ఓ మ్యాచ్‍లో ఆరు వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కారు.

ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ

డబ్ల్యూపీఎల్ లీగ్ దశలో 8 మ్యాచ్‍ల్లో 4 గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. గతేడాది తొలి సీజన్‍లో రెండు మ్యాచ్‍లే గెలిచి నిరాశపరిచిన ఆర్సీబీ.. ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్‌ చేరాయి. దీంతో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ లీగ్ దశలోనే ఔట్ అయ్యాయి.

ఫైనల్ చేరేదెవరో..

డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడాలి. ఆ మ్యాచ్‍లో గెలిచిన ఓ జట్టు ఫైనల్ పోరుకు వెళుతుంది. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‍ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 7 మ్యాచ్‍ల్లో 5 గెలిచిన ఢిల్లీ 10 పాయింట్లతో టాప్‍లో ఉంది. ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య రేపు (మార్చి 13) లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచినా.. స్వల్ప తేడాతో ఓడినా ఢిల్లీ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఢిల్లీ భారీ ఓటమి చెందితే అప్పుడు ముంబై ఇండియన్స్‌కు డైరెక్ట్ ఫైనల్ టికెట్ దక్కుతుంది. ఢిల్లీ టాప్‍లోనే నిలిస్తే.. మరో ఫైనల్ ప్లేస్ కోసం ఎలిమినేటర్లో ముంబై, బెంగళూరు తలపడాల్సి ఉంటుంది.

Whats_app_banner