ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఫైట్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ టైటిల్ కోసం ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడబోతున్నాయి. ఆసీస్ వరుసగా రెండో టైటిల్ పై కన్నేసింది. 2023లో జరిగిన ఫైనల్లో భారత్ ను కంగారూ టీమ్ ఓడించిన సంగతి తెలిసిందే. మరోవైపు సౌతాఫ్రికా ఫస్ట్ టైమ్ డబ్ల్యూటీసీ తుదిపోరు చేరింది.
ప్రపంచ క్రికెట్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ జూన్ 11న స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఈ మెగా పోరు జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు జట్లను అనౌన్స్ చేశాయి. ఈ అయిదు రోజుల మ్యాచ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది.
ఆసీస్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన బలమైన జట్టును మంగళవారం (మే 13) ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా స్వదేశంలో వేసవి సీజన్ కు దూరమైన లుంగి ఎంగిడి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీకి ఎంగిడి ఆడుతున్నాడు. సఫారీ టీమ్ కు తెంబా బవుమా కెప్టెన్. చివరగా పాకిస్థాన్ తో ఆడిన సిరీస్ లో జట్టులో ఉన్న మఫాకా స్థానంలో ఎంగిడి వచ్చాడు. బ్రీట్జ్ కే పై కూడా వేటు పడింది.
మే 31న అరుండేల్ లో సఫారీ జట్టు కలుస్తుంది. జూన్ 3 నుంచి 6 వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడి జూన్ 7న లండన్ వెళ్లనుంది. అయితే జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తమ జట్లు ప్లేఆఫ్స్ చేరితే.. కార్బిన్ బాష్, రికిల్టన్ (ముంబయి ఇండియన్స్), మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్), మార్క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), ట్రిస్టాన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) లాంటి సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై క్లారిటీ లేదు.
మరోవైపు డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ పూర్తి స్థాయి జట్టును అనౌన్స్ చేసింది. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా గాయం నుంచి కోలుకొని, తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ టీమ్ కు కమిన్స్ కెప్టెన్. ఐపీఎల్ 2025 లో ఆసీస్ ఆటగాళ్లు తిరిగి ఆడటంపైనా సందేహాలున్నాయి.
తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జీ, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, కగిసో రబాడ, ర్యాన్ రికిల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరీన్.
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్ స్టర్.
సంబంధిత కథనం