World Cup Warm-up Match: హైదరాబాద్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ వామప్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ.. ఇదీ కారణం
World Cup Warm-up Match: హైదరాబాద్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ వామప్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ మ్యాచ్ కు పోలీసులు భద్రత కల్పించలేమని చెప్పడంతో హెచ్‌సీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
World Cup Warm-up Match: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ చూడాలని ఆశపడిన అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్ కోసం సరిపడా భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రేక్షకులను అనుమతించకూడదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్ణయించింది. ఇప్పటికే టికెట్లు అమ్మి ఉంటే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బుక్ మై షోకి బీసీసీఐ చెప్పనుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పాకిస్థాన్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ సెప్టెంబర్ 29న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే అంతకుముందు రోజే అంటే సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఉంది. అదే రోజు మిలానున్ నబీ కూడా ఉండటంతో తగినంత భద్రతను అందించలేమని పోలీసులు నిర్వాహకులకు తేల్చి చెప్పారు.
"ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాం" అని బీసీసీఐ అధికారి చెప్పారు. నిజానికి ఈ మ్యాచ్ వాయిదా వేయాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ఇదే విషయాన్ని బీసీసీఐకి హెచ్‌సీఏ చెప్పినా.. అది కుదరదని బోర్డు స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక అభిమానులు లేకుండానే మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు.
గతంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో వరుసగా రెండు మ్యాచ్ లు ఉండటంతో వాటి తేదీలను కూడా మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరింది. కానీ అదీ కుదరలేదు. అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్.. అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మ్యాచ్ లు ఉన్నాయి. ఒక్కో మ్యాచ్ కోసం స్టేడియంలోనే 3 వేల మంది పోలీసులు అవసరం. ఇక పాకిస్థాన్ టీమ్ కావడంతో హోటల్ దగ్గర కూడా భారీగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇలా వరుసగా రెండు రోజులు అంటే కష్టమవుతుందని హెచ్‌సీఏ చెప్పినా.. పదే పదే షెడ్యూల్ మార్చడం కుదరదని బీసీసీఐ, ఐసీసీ తేల్చి చెప్పాయి. అక్టోబర్ 15న జరగాల్సిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను అక్టోబర్ 14కు మార్చడంతో మరో 7 మ్యాచ్ ల షెడ్యూల్ కూడా మార్చాల్సి వచ్చింది. దీంతో మరోసారి షెడ్యూల్ మార్చడానికి ఐసీసీ అంగీకరించలేదు.