World Cup Umpires: వరల్డ్ కప్ 2023లో అంపైరింగ్ చేసే వారి జాబితాను రిలీజ్ చేశారు. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగబోయే తొలి మ్యాచ్ కు ఇండియాకు చెందిన నితిన్ మేనన్, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన అంపైరింగ్ చేయనున్నారు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు.
అంపైర్ల జాబితాను శుక్రవారం (సెప్టెంబర్ 8) ఐసీసీ అనౌన్స్ చేసింది. తొలి మ్యాచ్ కు పాల్ విల్సన్ మూడో అంపైర్ కాగా.. సైకత్ ఫోర్త్ అంపైర్ గా ఉంటారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. మొత్తం వరల్డ్ కప్ 13వ ఎడిషన్ లో 16 మంది అంపైర్లు ఉండనున్నారు.
ఇందులో 12 మంది ఐసీసీకి చెందిన ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్ అంపైర్లు కాగా.. మరో నలుగురు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్ కు చెందిన వాళ్లు. వీళ్లలో ముగ్గురు అత్యంత అనుభవజ్ఞులైన అంపైర్లు ఉన్నారు. వీళ్లు 2019 వరల్డ్ కప్ ఫైనల్లో అంపైర్లుగా ఉండటం విశేషం. ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, రాడ్ టక్కర్ ఈ లిస్టులో ఉన్నారు.
ఇక ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీల జాబితాలో నలుగురు మాజీ క్రికెటర్లు ఉన్నారు. జవగళ్ శ్రీనాథ్ తోపాటు జెఫ్ క్రో, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్ రిఫరీలుగా ఉన్నారు. ఈ అంపైర్లు, రిఫరీలందరినీ లీగ్ స్టేజ్ కోసం ఎంపిక చేశారు. సెమీఫైనల్స్, ఫైనల్ కోసం రానున్న రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు.
క్రిస్ బ్రౌన్, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫనీ, మైఖేల్ గాఫ్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్గ్, రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మేనన్, ఎహసాన్ రజా, పాల్ రీఫిల్, షఫ్రుద్దౌలా షాయిద్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, పాల్ విల్సన్