World Cup 2023 Semi Finals Schedule: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్.. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?-world cup 2023 semi finals and final schedule when and where to watch india vs new zealand first semis ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  World Cup 2023 Semi Finals And Final Schedule When And Where To Watch India Vs New Zealand First Semis

World Cup 2023 Semi Finals Schedule: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్.. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu
Nov 14, 2023 07:52 AM IST

World Cup 2023 Semi Finals Schedule: వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్ కు టైమ్ దగ్గర పడింది. బుధ, గురువారాల్లో ఈ సెమీఫైనల్స్ జరగనున్నాయి. మరి తొలి సెమీఫైనల్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

నాకౌట్ స్టేజ్ కు సిద్ధమైన క్రికెట్ వరల్డ్ కప్ 2023
నాకౌట్ స్టేజ్ కు సిద్ధమైన క్రికెట్ వరల్డ్ కప్ 2023 (AP)

World Cup 2023 Semi Finals Schedule: వరల్డ్ కప్ 2023లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక అసలుసిసలు నాకౌట్ సమరానికి టైమ్ దగ్గర పడింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ మెగా టోర్నీలో ఇక సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో పాయింట్ల పట్టికలో తొలి, నాలుగు స్థానాల్లో ఉన్న ఇండియా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ ఎప్పుడు?

ఇండియా, న్యూజిలాండ్ మధ్య 2019 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ రిపీట్ కానుంది. ఆ మ్యాచ్ లో పోరాడి ఓడిన ఇండియా.. ఈసారి స్వదేశంలో న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే లీగ్ స్టేజ్ లో ఒకసారి న్యూజిలాండ్ ను ఓడించింది. ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ సెమీఫైనల్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు. హాట్‌స్టార్ మొబైల్ యాప్ లో అయితే మ్యాచ్ ఫ్రీగా చూసే వీలుంది. ఇండియా వరల్డ్ కప్ లలో వరుసగా నాలుగోసారి సెమీఫైనల్ చేరింది. మరి 2015, 2019 వరల్డ్ కప్ ల చేదు అనుభవాలను అధిగమించి ఇండియా ఫైనల్ చేరుతుందా? 2011 తర్వాత మళ్లీ వరల్డ్ కప్ గెలుస్తుందా చూడాలి.

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఎప్పుడు?

ఇక వరల్డ్ కప్ 2023 రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (నవంబర్ 16) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. హాట్‌స్టార్ మొబైల్ యాప్ లో ఫ్రీగా చూడొచ్చు.

ఫైనల్ ఎప్పుడు?

వరల్డ్ కప్ 2023 ఫైనల్ వచ్చే ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. వరల్డ్ కప్ ఎక్కడ మొదలైందో అక్కడే ముగియనుంది. ఈ స్టేడియంలోనే అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో తలపడిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో వరల్డ్ కప్ 2023 ఘనంగా ముగియనుంది.

సెమీస్‌లోకి టీమ్స్ ఎలా క్వాలిఫై అయ్యాయంటే?

వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ కు అర్హత సాధించిన తొలి జట్టు ఇండియానే. లీగ్ స్టేజ్ లో ఆడిన 9 మ్యాచ్ లలోనూ తిరుగులేని విజయాలు సాధించి ఓటమెరగని టీమ్ గా సెమీఫైనల్లో అడుగుపెడుతున్న ఏకైక టీమ్ టీమిండియా. లీగ్ స్టేజ్ లో 18 పాయింట్లు, 2.570 నెట్ రన్ రేట్ సాధించింది.

ఇక సెమీస్ కు అర్హత సాధించిన రెండో టీమ్ సౌతాఫ్రికా. పెద్దగా అంచనాలు లేకుండా ఈ మెగా టోర్నీ బరిలో దిగిన సౌతాఫ్రికా.. 9 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించింది. ఇండియా, నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోయింది.

ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా కాస్త కష్టంగానే అయినా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆ టీమ్ కూడా 9 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించింది. ఇండియా, సౌతాఫ్రికాలతో తొలి రెండు మ్యాచ్ లలో ఓడినా.. తర్వాత వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచింది.

వరల్డ్ కప్ 2023లో మొదట వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, తర్వాత వరుసగా నాలుగు ఓడింది న్యూజిలాండ్. అయితే చివరి మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేయడంతోపాటు మెరుగైన నెట్ రన్ రేట్ కూడా ఉండటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

WhatsApp channel