తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోనే ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఏడాది భారత్ హోస్ట్ గా నిర్వహించే వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఓ మ్యాచ్ తో పాటు ఓపెనింగ్ సెర్మనీకి వైజాగ్ స్టేడియం వేదికగా నిలవనుంది. శనివారం (మార్చి 22) కోల్ కతాలో జరిగిన బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఈ మేరకు చర్చించినట్లు తెలిసింది.
మహిళల వన్డే ప్రపంచకప్ కు భారత్ నాలుగోసారి ఆతిథ్యమివ్వబోతోంది. 1978, 1997, 2003 లో కూడా వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ లోనే జరిగింది. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీకి ఇండియా హోస్ట్ గా నిలవబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ ప్రపంచకప్ జరిగే అవకాశముంది.
మొత్తం అయిదు వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో వైజాగ్ లో ఓపెనింగ్ సెర్మనీతో పాటు తొలి మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ముల్లాన్ పూర్, ఇండోర్, తిరువనంతపురం, గువాహతి ఇతర వేదికలుగా షార్ట్ లిస్ట్ చేశారు. ఈ మెగా టోర్నీ మూడు వారాల పాటు సాగుతుంది.
వైజాగ్ లో స్టేడియంలో రాబోయే నెలల్లో ఎక్కువ క్రికెట్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ టెస్టు, ఐపీఎల్ వేదికగా మారిన వైజాగ్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే ఓ వన్డేకు కూడా ఆతిథ్యమిచ్చే అవకాశముంది.
వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో అంతర్జాతీయ వన్డే జరగబోతోంది. ఈ ఏడాది నవంబర్ లో మొదలయ్యే సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ టూర్ లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు జరుగుతాయి. రెండో టెస్టు గువాహటిలోని బార్సాపారా స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ వేదికలో జరగబోయే మొట్టమొదటి టెస్టు ఇదే. ఆ తర్వాత వన్డే సిరీస్ లో భాగంగా వైజాగ్ లో డిసెంబర్ 3న వన్డే మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరించనుంది.
భారత దేశవాళీ క్రికెట్లో జోనల్ సిస్టమ్ ను మళ్లీ తీసుకురాబోతున్నారు. ఆరు జోన్లు తలపడతాయి. ఈ డొమెస్టిక్ సీజన్ లో దులీప్ ట్రోఫీని మొదట నిర్వహిస్తారు. అంతే కాకుండా స్కోరర్స్ కు పేమేంట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక డొమెస్టిక్ మ్యాచ్ కు ప్రతి స్కోరర్ రూ.15 వేలు పొందుతారు.
సంబంధిత కథనం