భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కి శనివారం (అక్టోబరు 12)న హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఈరోజు సాఫీగా జరిగే సూచనలు కనిపించడం లేదు.
గ్వాలియర్ వేదికగా ఇటీవల జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో హైదరాబాద్ టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
కానీ.. ఈ మూడో మ్యాచ్‌కు ముందు అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలిగించే సూచనలు కనపిస్తున్నాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కూడా మేఘావృతమై వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది.
వాస్తవానికి హైదరాబాద్‌లో శుక్రవారం కూడా వర్షం పడింది. దాంతో స్టేడియం సిబ్బంది మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా వర్షం పడితే మ్యాచ్‌కి ఇబ్బంది తప్పదు.
ఇటీవల కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వర్షం కారణంగా రెండున్నర రోజుల పాటు మ్యాచ్ ఆడలేకపోయినప్పటికీ భారత్ అద్భుత ప్రదర్శన చేసి చివరి రెండు రోజుల్లో మ్యాచ్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఈరోజు హైదరాబాద్‌లో వర్షం పడినా మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం మాత్రం ఉండదని అక్యూవెదర్ రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది.
ఆఖరి టీ20కి భారత్ తుది జట్టులో మార్పులు ఉండబోతున్నాయి. యంగ్ ప్లేయర్ హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ సంకేతాలిచ్చాడు. అలానే సంజు శాంసన్‌పై వేటు పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉప్పల్ పిచ్ గత కొంతకాలంగా బ్యాటింగ్‌కి బాగా కలిసొస్తోంది. అలానే భారత్‌కి కూడా ఈ స్టేడియంలో మెరుగైన టీ20 రికార్డ్ ఉంది. ఇక్కడ ఆడిన రెండు ఇంటర్నేషనల్ టీ20ల్లోనూ టీమిండియాదే విజయం. ఐపీఎల్ 2024లో ఉప్పల్‌లోనే 277 పరుగుల రికార్డ్ స్కోరు కూడా నమోదైంది. ఛేజింగ్‌కి పిచ్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకు మొగ్గు చూపవచ్చు.