Virat Kohli RCB: కెప్టెన్సీ ఇస్తామంటే కోహ్లీనే వద్దన్నాడు.. ఇదే రీజన్.. యువ వికెట్ కీపర్ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli RCB: ఐపీఎల్ 2025 కోసం కొత్త కెప్టెన్ గా రజత్ పటీదార్ ను ఆర్సీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీకి మరోసారి కెప్టెన్సీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశాడని ఆ టీమ్ యంగ్ వికెట్ కీపర్ వెల్లడించాడు.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ఫ్రాంఛైజీ రజత్ పటీదార్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఈ నిర్ణయం షాకింగ్ గా అనిపించింది. అయితే ముందుగా కోహ్లీకే కెప్టెన్సీ ఆఫర్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడని తాజాగా యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆఫర్ కు నో
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గత కెప్టెన్ డుప్లెసిస్ ను ఆర్సీబీ వదులుకుంది. అతని స్థానంలో మరో కెప్టెన్సీ ఆటగాణ్ని కూడా తీసుకోలేదు. దీంతో కోహ్లీనే మళ్లీ ఆర్సీబీని నడిపిస్తాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు కోహ్లీకి ఫ్రాంఛైజీ ఆఫర్ ఇచ్చినా కోహ్లి వద్దన్నాడని జితేశ్ వెల్లడించాడు.
‘‘రజత్ ఆర్సీబీకి కెప్టెన్ అయ్యాడనే విషయం అందరితో పాటు సోషల్ మీడియాలో నాకూ తెలిసింది. కానీ ముందే రజత్ పోటీలో ఉన్న సంగతి నాకు తెలుసు. జట్టుతో ఉన్నప్పుడు ఈ విషయాలు తెలియడం కామనే. విరాట్ భాయ్ ఆర్సీబీకి కెప్టెన్ గా ఉండాలని అనుకోలేదు. ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు’’ అని జితేశ్ పేర్కొన్నాడు.
జితేశ్ చెప్పిన రీజన్
గతేడాది పంజాబ్ కింగ్స్ కు ఆడిన జితేశ్ ను ఈ సారి వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. అయితే మొదట ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లి వద్దనుకున్నాడని చెప్పిన జితేశ్ ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. 2021 ఐపీఎల్ సీజన్లో చివరిగా ఆర్సీబీకి కోహ్లి కెప్టెన్ గా ఉన్నాడు. మూడేళ్లు సారథ్యానికి దూరంగా ఉండటంతోనే కోహ్లి మళ్లీ కెప్టెన్సీకి ఒప్పుకోలేదేమోనని జితేశ్ అన్నాడు.
‘‘అతను (కోహ్లి) కెప్టెన్సీని ఎందుకు కోరుకోలేదో నాకు తెలియదు. నేను మేనేజ్ మెంట్ సైడ్ లో లేను. మేనేజ్ మెంట్ వైపు ఉన్నప్పుడు మీకు చెప్తా. కానీ గత మూడేళ్లుగా అతను కెప్టెన్ గా లేడు. అందుకే ఈ సారి కూడా ఆ బాధ్యత తీసుకోలేదని భావిస్తున్నా. అందుకు ప్రస్తుతం రజత్ బెస్ట్ ఆప్షన్’’ అని జితేశ్ తెలిపాడు.
కోహ్లీతో చర్చలు
ఆర్సీబీ కెప్టెన్ ను ప్రకటించే ముందు కోహ్లీతో చర్చించామని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు.
‘‘కోహ్లీతో జరిగిన చర్చల్లో ఓ వ్యక్తిగా అతను చూపించిన చిత్తశుద్ధి, పరిపక్వత నేను ఊహించిందే. అతనితో మాట్లాడటాన్ని నిజంగా ఆస్వాదించా. అతనికి రజత్ అంటే చాలా ఇష్టం. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా రజత్ ను గౌరవిస్తాడు. ఆ బంధం చాలా ముఖ్యమైందని అనుకుంటున్నా’’ అని ఫ్లవర్ తెలిపాడు.
సంబంధిత కథనం