Champions Trophy: మినీ ప్రపంచకప్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు? ఇదే రీజన్-why champions trophy started reason mini world cup india vs pakistan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy: మినీ ప్రపంచకప్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు? ఇదే రీజన్

Champions Trophy: మినీ ప్రపంచకప్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు? ఇదే రీజన్

Chandu Shanigarapu HT Telugu
Published Feb 14, 2025 04:48 PM IST

Champions Trophy: క్రికెట్లో వన్డే ప్రపంచకప్ ఉండగా.. మళ్లీ అదే 50 ఓవర్ల ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు? అసలు ఈ టోర్నీ ప్రారంభించడానికి కారణం ఏమిటి? ఎప్పుడు? ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే చదివేయండి.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్ (AFP)

ఒకప్పుడు క్రికెట్లో వన్డే ప్రపంచకప్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారు. ఈ ఐసీసీ టోర్నీలు ఉన్నప్పటికీ ఛాంపియన్ ట్రోఫీ అంటే ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంది. ప్రపంచంలోని టాప్-8 జట్ల మధ్య పోరు మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.

క్రికెట్ డెవలప్మెంట్ కోసం

ప్రపంచకప్ లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలు మాత్రమే పోటీపడేవి. దీంతో టెస్టు హోదా లేని దేశాల్లో క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఐసీసీ 1998లో వన్డే ఫార్మాట్లో నాకౌట్ ట్రోఫీకి ప్రాణం పోసింది. తొలి రెండు ట్రోఫీలను వరుసగా బంగ్లాదేశ్, కెన్యాలో నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. పోటీపడే జట్ల సంఖ్య ను 12కు పెంచారు.

మినీ ప్రపంచకప్

2004లో 12, 2006లో 10 జట్లతో టోర్నీ నిర్వహించారు. కానీ 2009 నుంచి టాప్-8 జట్ల మధ్య టోర్నీ నిర్వహిస్తుండటంతో ఇది మినీ ప్రపంచకప్ గా పేరు తెచ్చుకుంది. అయితే వన్డే ప్రపంచకప్ వాల్యూ తగ్గకుండా ఉండటం కోసం ఛాంపియన్స్ ట్రోఫీని తక్కువ రోజుల్లో, తక్కువ మ్యాచ్ లతో నిర్వహిస్తున్నారు. టోర్నీ ఆరంభానికి ఆరు నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉండే జట్లు ఈ ట్రోఫీలో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.

నాలుగేళ్లకోసారి

మొదట ఛాంపియన్స్ ట్రోఫీని రెండేళ్లకోసారి నిర్వహించేవాళ్లు. కానీ 2008లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల పాకిస్థాన్ లో టోర్నీ జరగలేదు. దీన్ని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్ మాదిరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం మొదలెట్టారు.

కానీ ప్రపంచకప్ వాల్యూ తగ్గకూడదని 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేశారు. అయితే తిరిగి టోర్నీ నిర్వహిస్తామని 2021లో ఐసీసీ ప్రకటించింది. ఇప్పుడు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ఆరంభమవుతుంది.

ఫార్మాట్ ఇలా

రెండున్నర వారాల్లో ముగిసేలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్ ను రూపొందించారు. 8 జట్లను రెండు గ్రూప్ లుగా డివైడ్ చేశారు. ఆయా గ్రూప్ లోని జట్టు మిగతా మూడు జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ లో టాప్-2లో నిలిచే జట్లు డైరెక్ట్ సెమీస్ చేరతాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇలా చూసుకుంటే ఓ జట్టు గరిష్ఠంగా అయిదు (గ్రూప్లో 3, సెమీస్, ఫైనల్) మ్యాచ్ లు ఆడుతుంది. టోటల్ 15 మ్యాచ్ ల్లో టోర్నీ కంప్లీట్ అవుతుంది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం