Team India: బుమ్రాను ఎంపిక చేసినా.. అనుమానమేనా! కెప్టెన్ రోహిత్, అగార్కర్ ఏం చెప్పారంటే..
Jasprit Bumrah - Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు భారత జట్టు ఎంపికైంది. అయితే, బుమ్రా సెలెక్ట్ అయినా సందిగ్ధత ఉంది. ఈ విషయంపై ప్రెస్‍మీట్‍లో స్పందించారు రోహిత్ శర్మ, అగార్కర్.
ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించాడు. ముంబైలో నేడు (జనవరి 18) జరిగిన మీడియా సమావేశం ద్వారా 15 మందితో కూడిన టీమిండియాను వెల్లడించాడు. ఈ సమావేశంలో అగార్కర్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాట్లాడాడు. గాయం బారిన పడిన భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాను కూడా జట్టులో ఉన్నాడు. అయినా బుమ్రా విషయంలో సందిగ్ధత ఉందనేలా రోహిత్, అగార్కర్ చెప్పారు.

కచ్చితంగా చెప్పలేం.. అందుకే..
ఈనెలలోనే ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో జస్‍ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే, భారత జట్టులో బుమ్రానే అత్యంత కీలకమైన బౌలర్. ఛాంపియన్స్ ట్రోఫీని అతడు ఉండడం టీమిండియాకు చాలా అవసరం. దీంతో ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, వన్డే సిరీస్ కల్లా బుమ్రా సిద్ధం కాకపోతే అతడికి బ్యాకప్‍గా హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేశారు.
బుమ్రా గాయం విషయంలో ఇంకా తమకు ఇప్పుడు పూర్తి క్లారిటీ రాలేదని మీడియా సమావేశంలో రోహిత్ శర్మ చెప్పాడు. “ప్రస్తుతం బుమ్రా గురించి మేం కచ్చితంగా లేం. అందుకే అతడి రోల్ చేయగలిగే అర్షదీప్ సింగ్‍ను తీసుకున్నాం” అని రోహిత్ శర్మ చెప్పాడు. అలాగే, బుమ్రా ఆడకపోతే వన్డే సిరీస్ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు.
ఫిబ్రవరి తొలివారంలో..
జస్‍ప్రీత్ బుమ్రా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫిబ్రవరి తొలి వారంలో అతడికి మరోసారి స్కాన్ చేయించి.. పరిస్థితిని సమీక్షించాలని బీసీసీఐ అనుకుంటోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. “మేం బుమ్రాపై అప్‍డేట్ కోసం ఎదురుచూస్తున్నాం. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిబ్రవరి మొదట్లో మాకు అతడి పరిస్థితి తెలుస్తుంది” అని అగార్కర్ తెలిపాడు.
మరోవైపు, దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయకపోవడంపై కూడా అగార్కర్ స్పందించారు. అది స్పెషల్ పర్ఫార్మెన్స్ అని, ఇప్పుడు అతడికి ఇచ్చేందుకు భారత జట్టులో చోటు లేదని చెప్పాడు.
భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‍కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత జట్టులో చోటు దక్కలేదు. సంజూ శాంసన్‍కు కూడా ప్లేస్ లభించలేదు. రిషబ్ పంత్‍పైనే సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. సంజూకు చోటివ్వకపోవడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, వైస్ కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
స్వదేశంలో ఇంగ్లండ్‍తో ఐదు టీ20ల సిరీస్ (జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2) తర్వాత మూడు వన్డేల సిరీస్‍ను ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య భారత ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిది జట్ల మధ్య జరగనుంది.
ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ (వన్డే సిరీస్‍కు బుమ్రా రెడీ కాకపోతే హర్షిత్ రాణా జట్టులోకి వస్తాడు.)
సంబంధిత కథనం