Virender Sehwag son: తండ్రికి తగ్గ తనయుడు.. డబుల్ సెంచరీ బాదిన సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్
Virender Sehwag son: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ తాను తండ్రికి తగిన కొడుకునే అని నిరూపించుకున్నాడు. కూచ్ బేహార్ టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం విశేషం.
Virender Sehwag son: వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్ తెలుసు కదా. ఫార్మాట్ తో సంబంధం లేకుండా బాదుడే పనిగా పెట్టుకొని డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచాడు. ఇప్పుడతని తనయుడు ఆర్యవీర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తాజాగా గురువారం (నవంబర్ 21) కూచ్ బేహార్ టోర్నీలో భాగంగా మేఘాలయాతో మ్యాచ్ లో ఢిల్లీ తరఫున డబుల్ సెంచరీ బాదాడు.
ఆర్యవీర్ డబుల్ సెంచరీ
కూచ్ బేహార్ టోర్నీ అంటే జాతీయ స్థాయిలో అండర్ 19 క్రికెటర్లు ఆడే నాలుగు రోజుల క్రికెట్ టోర్నమెంట్. ప్రతి ఏటా జరుగుతుంది. తాజాగా గురువారం మేఘాలయాలోని షిల్లాంగ్ లో ఆ జట్టుతో తలపడిన ఢిల్లీ తరఫున సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ బరిలోకి దిగాడు. బుధవారం (నవంబర్ 20) ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. తొలి ఇన్నింగ్స్ లో మేఘాలయ 260 రన్స్ కే ఆలౌటైంది.
తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభం కాగా.. ఆర్యవీర్ ఓపెనర్ గా వచ్చాడు. ఆర్నవ్ తో కలిసి అతడు తొలి వికెట్ కు 180 పరుగులు జోడించాడు. ఆర్నవ్ సెంచరీ చేసి ఔటవగా.. ఆర్యవీర్ డబుల్ సెంచరీ బాదాడు. రెండో రోజు 229 బంతుల్లో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 34 బౌండరీలు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 468 రన్స్ చేసింది. ధన్య నక్రా 98 రన్స్ తో క్రీజులో ఉన్నాడు.
ఐపీఎల్‌పై కన్నేశాడు
తన కొడుకు ఆర్యవీర్ గురించి తొలిసారి 2019లో సెహ్వాగ్ మాట్లాడాడు. తన కొడుకుగా ఆర్యవీర్ మరో సెహ్వాగే కావాలన్న కోరిక తనకు లేదని చెప్పాడు. "వాళ్లలో మరో సెహ్వాగ్ ను చూడాలని నేను అనుకోవడం లేదు. వాళ్లు విరాట్ కోహ్లి లేదా హార్దిక్ పాండ్యా లేదా ధోనీ కూడా కావచ్చు. అసలు క్రికెటరే కాకపోవచ్చు. వాళ్ల కెరీర్లు వాళ్లే ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. వాటిని సాధించడానికి నేను సాయం చేస్తాను. కానీ ముందుగా మంచి మనుషులుగా ఎదగాలని కోరుకుంటున్నాను" అని వీరూ అన్నాడు.
ఇక గతేడాది మరోసారి తన కొడుకు ఆర్యవీర్ గురించి సెహ్వాగ్ మాట్లాడాడు. అప్పటికే ఐపీఎల్లోకి అడుగుపెట్టే దిశగా ఆర్యవీర్ అడుగులు వేస్తున్నట్లు తెలిపాడు. ఆర్యవీర్ అక్టోబర్ లో జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో ఆడాడు. మణిపూర్ తో మ్యాచ్ లో 49 రన్స్ చేశాడు.
"నా కొడుకు వయసు 15 ఏళ్లు. ఐపీఎల్లో ఆడేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ వీరూ అన్నాడు. గతంలో రంజీ ట్రోఫీలో రాణించినా ఇండియన్ టీమ్ లో చోటు దక్కని వాళ్లు ఉన్నారని, కానీ ఐపీఎల్లో బాగా ఆడితే మాత్రం నేషనల్ జట్టులో చోటు దక్కుతోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
టాపిక్