విరాట్ కోహ్లి 18 ఏళ్లే వేచి చూశాడు.. కానీ సచిన్ అంత కంటే చాలా ఎక్కువే: సెహ్వాగ్ కామెంట్స్-virat kohli waited only 18 years sachin tendulkar more than that says virender sehwag ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  విరాట్ కోహ్లి 18 ఏళ్లే వేచి చూశాడు.. కానీ సచిన్ అంత కంటే చాలా ఎక్కువే: సెహ్వాగ్ కామెంట్స్

విరాట్ కోహ్లి 18 ఏళ్లే వేచి చూశాడు.. కానీ సచిన్ అంత కంటే చాలా ఎక్కువే: సెహ్వాగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

విరాట్ కోహ్లి ఐపీఎల్ ట్రోఫీ విజయాన్ని సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ విజయంతో పోల్చాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. కోహ్లి కేవలం 18 ఏళ్లే వేచి చూశాడంటూ వీరూ కామెంట్ చేయడం విశేషం.

విరాట్ కోహ్లి 18 ఏళ్లే వేచి చూశాడు.. కానీ సచిన్ అంత కంటే చాలా ఎక్కువే: సెహ్వాగ్ కామెంట్స్ (AFP)

విరాట్ కోహ్లి ఐపీఎల్ ట్రోఫీ విజయంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంతో.. విరాట్ కోహ్లీకి చాలా కాలంగా ఉన్న కప్పు కల నెరవేరింది. 2008లో లీగ్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ట్రోఫీ కరువు తీరడానికి ముందు, అతడు మూడు సార్లు ఫైనల్స్‌లో ఓటమిని చవిచూశాడు.

సచిన్‌తో పోల్చిన సెహ్వాగ్

ఆర్సీబీ గెలుపొందిన తర్వాత.. కోహ్లీతో టీమిండియా, ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ట్రోఫీ కోసం ఎదురుచూసిన "నిరీక్షణ" గురించి అడిగినప్పుడు.. సచిన్ టెండూల్కర్ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ కోసం మరింత ఎక్కువ కాలం వేచి చూశాడని సెహ్వాగ్ గుర్తుచేశాడు. అయినా సచిన్ ఎప్పుడూ ఆశ కోల్పోలేదని చెప్పాడు.

"కోహ్లీ కేవలం 18 ఏళ్లు మాత్రమే ట్రోఫీ కోసం వేచి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1989 నుండి 2011 వరకు వేచి ఉన్నాడు. కాబట్టి కోహ్లి నిరీక్షణ తక్కువే. అయినా సచిన్ ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ప్రపంచ కప్ ట్రోఫీ చేత పట్టుకునే వరకు తాను తప్పుకోనని అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు" అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో అన్నాడు. కోహ్లీ ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చని, ఎప్పుడు రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా పశ్చాత్తాపం లేకుండా తప్పుకోవచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

"విరాట్ కోహ్లీకి కూడా అంతే. ఇప్పుడు అతడు రిలాక్స్ అవ్వొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐపీఎల్ ఆడటం మానేయొచ్చు. ఒక ఆటగాడు ట్రోఫీ గెలవడానికే ఆడతాడు. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. కానీ ట్రోఫీలు గెలవడం అంత సులువు కాదు. కోహ్లీ నిరీక్షణ ముగిసినా, జట్టు విజయానికి అతడు చాలా బలమైన సహకారం అందించాడు" అని మాజీ ఓపెనర్ అన్నాడు.

ఫైనల్లో కోహ్లీ కీలక పాత్ర

ఫైనల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అది అంత దూకుడైన ఇన్నింగ్స్ కానప్పటికీ అతడు క్రీజులో ఉండటం ఆర్సీబీ 20 ఓవర్లలో 190 పరుగుల బలమైన స్కోరు చేరుకోవడానికి సహాయపడింది.

కోహ్లీ 2025 సీజన్‌ను 15 మ్యాచ్‌లలో 657 పరుగులతో ముగించాడు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతని సగటు 54.75 కాగా, స్ట్రైక్ రేట్ 144.71. ఈ సీజన్‌లో అతడు ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం