Kohli vs Konstas: బుమ్రా బౌలింగ్‌లో నాలుగేళ్ల తర్వాత సిక్స్.. ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్‌తో కోహ్లి గొడవ
Kohli vs Konstas: బుమ్రా బౌలింగ్ లో ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ సిక్స్ కొట్టాడు. టెస్టుల్లో సుమారు నాలుగేళ్ల తర్వాత ఓ బ్యాటర్ బుమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టడం విశేషం. తొలి టెస్టులోనే చెలరేగిపోయిన అతడితో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వాగ్వాదానికి దిగాడు.
Kohli vs Konstas: బుమ్రా బౌలింగ్ లో ఓ 19 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ సిక్స్ కొట్టాడు. అది కూడా టెస్టుల్లో నాలుగేళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఆ సిక్స్ కొట్టిన ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ తో విరాట్ కోహ్లి కావాలని గొడవకు దిగడం మాత్రం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. మెల్‌బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజే ఈ గొడవ జరగడం గమనార్హం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కోహ్లి వర్సెస్ కోన్‌స్టాస్
బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కోన్‌స్టాస్ కు టెస్ట్ క్యాప్ అందించింది. అయితే అలాంటి క్రికెటర్ తో విరాట్ కోహ్లిలాంటి సీనియర్ బ్యాటర్ గొడవకు దిగడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. అందులోనూ కోహ్లి కావాలనే ఇలా చేసినట్లు కూడా వీడియో చూస్తే స్పష్టమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రా బౌలింగ్ ను చిత్తుగా కొడుతూ ఒకే ఓవర్లో 14 రన్స్ చేశాడు కోన్‌స్టాస్.
అందులోనూ ఓ రివర్స్ స్కూప్ తో సిక్స్ కొట్టాడు. 2021 తర్వాత బుమ్రా బౌలింగ్ లో టెస్టుల్లో ఓ బ్యాటర్ సిక్స్ కొట్టడం ఇదే తొలిసారి. ఇది చూసి మండిపోయిందో ఏంటో.. కోహ్లి కావాలనే కోన్‌స్టాస్ ను కెలికి మరీ గొడవకు దిగినట్లు కనిపిస్తోంది. బుమ్రా బౌలింగ్ లో 14 పరుగులు వచ్చిన తర్వాత ఎండ్స్ మారుతున్న సమయంలో కోన్‌స్టాస్ మరో ఎండ్ కు వెళ్తున్నాడు. అతనికి ఎదురుగా వచ్చిన విరాట్.. భుజాన్ని బలంగా ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో వెంటనే కోన్‌స్టాస్ అతన్ని ఏదో అన్నాడు. కోహ్లి కూడా వాగ్వాదానికి దిగాడు.
అది చూసి పక్కనే ఉన్న ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ పాల్ రైఫిల్ రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తే.. కోహ్లి కావాలనే కోన్‌స్టాస్ తో గొడవకు దిగినట్లుగా కనిపించింది. ఆ సమయంలో కామెంటరీ చేస్తున్న రికీ పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇది చూసి సోషల్ మీడియాలో అభిమానులు కూడా కోహ్లిని ట్రోల్ చేస్తున్నారు. మరీ 19 ఏళ్ల కుర్ర బ్యాటర్ తో అంతటి సీనియర్ గొడవకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చెలరేగిపోయిన కోన్‌స్టాస్
బుమ్రా బౌలింగ్ లో ఆడటానికి ఆస్ట్రేలియా బ్యాటర్లంతా కిందామీదా పడుతుంటే.. ఈ 19 ఏళ్ల కోన్‌స్టాస్ మాత్రం చెలరేగిపోయాడు. బుమ్రా వేసిన తొలి రెండు, మూడు ఓవర్లు కాస్త ఇబ్బంది పడుతూ ఆచితూచి ఆడినా.. తర్వాత రెచ్చిపోయాడు. కోహ్లితో గొడవ తర్వాత మరింత చెలరేగాడు. బుమ్రా బౌలింగ్ లో ఓసారి ఒకే ఓవర్లో 14 పరుగులు, తర్వాతి ఓవర్లో 18 పరుగులు బాదడం విశేషం. ఈ రెండు ఓవర్లలోనూ రెండు సిక్స్ లు కొట్టాడతడు.
దీంతో బుమ్రా తన తొలి స్పెల్ 6 ఓవర్లలో ఏకంగా 38 పరుగులు ఇచ్చాడు. తొలి 3 ఓవర్లలో కేవలం 2 పరుగులే ఇచ్చిన బుమ్రాకు.. తర్వాత కోన్‌స్టాస్ చుక్కలు చూపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కేవలం 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కోన్‌స్టాస్.. చివరికి 65 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇచ్చిన ధైర్యంతో ఫామ్ లోలేని ఖవాజాతోపాటు లబుషేన్, స్మిత్ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు 6 వికెట్లకు 311 రన్స్ చేసింది.