14 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్ ను విరాట్ ముగించాడు. 123 టెస్టుల్లో కోహ్లి 9230 పరుగులు చేశాడు. సోమవారం (మే 12) టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు కింగ్. సుదీర్ఘ ఫార్మాట్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ లు ఆడాడు అతడు. టీమ్ కు అద్భుత విజయాలు అందించాడు. అతని పోరాట పటిమ, మైదానంలో దూకుడు టీమ్ యాటిట్యూడ్ నే పూర్తిగా ఛేంజ్ చేసింది. టెస్టుల్లో కోహ్లి టాప్-5 ఇన్నింగ్స్ లు చూసేయండి.
2013లో జొహానెస్ బర్గ్ లోని సీమింగ్ పిచ్ పై దక్షిణాఫ్రికాతో టెస్టు. అప్పటికీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి నెల రోజులే అయింది. కోహ్లి నాలుగో స్థానంలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్, మోర్నీ మోర్కెల్ లాంటి ప్రమాదకర పేస్ త్రయాన్ని తట్టుకుని కోహ్లి చేసిన సెంచరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్ స్థానాన్ని భర్తీ చేసేది తానేనని ఆ సెంచరీతో విరాట్ చాటిచెప్పాడు.
విరాట్ కోహ్లీని టాలెంటెడ్ స్టార్ నుంచి ఫ్యూచర్ లెజెండ్ గా మార్చిన ఇన్నింగ్స్ ఇది. 2014లో అడిలైడ్ ఓవల్ మైదానంలో కోహ్లీ చేసిన రెండో ఇన్నింగ్స్ సెంచరీ క్రికెట్లో భారత్ కు మరో స్టార్ దొరికాడని తెలియజేసింది. ఆ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో విరాట్ సెంచరీలు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు జట్టుకు అవసరమవగా.. వీరోచితంగా పోరాడిన కోహ్లి ఆ పిచ్ పై భయంకరమైన ఆసీస్ బౌలింగ్ దాడిని తట్టుకుని శతకం సాధించాడు. టీమ్ ఓడిపోయినా.. అప్పుడే ఓ లెజెండ్ పుట్టాడు.
2016లో వాంఖడేలో టెస్టు. 2008 నుంచి ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ను అప్పటివరకూ భారత్ గెలుచుకోలేదు. ఈ సారి కెప్టెన్ గా నవశకానికి నాంది పలికాడు విరాట్. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అప్పటికే టీమిండియా 2-0తో లీడ్ లో ఉంది. ముంబయిలో నాలుగో టెస్టులో కోహ్లి 235 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసినప్పటికీ భారత్ ఇన్నింగ్స్ తేడాతో మ్యాచ్ గెలిచిందంటే విరాట్ బ్యాటింగే కారణం.
2018 ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ కు క్రికెట్ ప్రపంచమే అతనికి సెల్యూట్ కొట్టింది. అంతకుముందు ఇంగ్లాండ్ లో కోహ్లికి గణాంకాలు దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ప్రత్యర్థి బౌలింగ్ ను తట్టుకుని కోహ్లి నిలబడ్డాడు. ఎనిమిదో వికెట్ పడే సమయానికి భారత్ 105 పరుగుల వెనుకంజలో ఉండగా.. కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ తో ఇంగ్లండ్ గడ్డపై తన తొలి టెస్టు సెంచరీ అందుకున్నాడు.
ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్.. "నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లి" అని అంగీకరించేలా చేసిన ఇన్నింగ్స్ ఇది. 2018లో పెర్త్ టెస్టులో 123 పరుగుల ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచాన్ని మైమరిపించాడు. 8/2తో కష్టాల్లో పడ్డ జట్టును అసాధారణ ఇన్నింగ్స్ తో విరాట్ ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్లపై అతని ఆధిపత్యం చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది.
సంబంధిత కథనం