తిరుగులేని కెప్టెన్.. బెదురులేని బ్యాటర్.. టెస్టుల్లో కోహ్లి రికార్డులు.. చూస్తే వావ్ అనాల్సిందే!-virat kohli retirement his records as captain and batter are unbelievable records look at his feats ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  తిరుగులేని కెప్టెన్.. బెదురులేని బ్యాటర్.. టెస్టుల్లో కోహ్లి రికార్డులు.. చూస్తే వావ్ అనాల్సిందే!

తిరుగులేని కెప్టెన్.. బెదురులేని బ్యాటర్.. టెస్టుల్లో కోహ్లి రికార్డులు.. చూస్తే వావ్ అనాల్సిందే!

కెప్టెన్ గా భారత టెస్టు జట్టుపై చెరగని ముద్ర వేసి.. బ్యాటర్ గా రికార్డుల దుమ్ము దులిపి విరాట్ కోహ్లి వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ రికార్డుల రారాజు రికార్డులు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.

విరాట్ కోహ్లి

అద్బుతమైన టెస్టు కెరీర్ లో అసాధారణ ఘనతలు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం (మే 12) టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు కింగ్. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో విరాట్ ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా తిరుగులేని ఘనతలు సొంతం చేసుకున్నాడు. అవేంటో చూసేయండి.

  • 2011లో వెస్టిండీస్ తో మ్యాచ్ తో విరాట్ కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. చివరగా 2025లో ఆస్ట్రేలియాతో ఆడాడు. 123 మ్యాచ్ ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు కోహ్లి. ఇందులో 31 అర్ధశతకాలు, 30 సెంచరీలున్నాయి.
  • టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్లో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,288), సునీల్ గవాస్కర్ (10,122) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
  • అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ కోహ్లి. అతను 7 ద్విశతకాలు సాధించాడు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచ క్రికెట్లో విరాట్ అయిదో ప్లేస్ లో ఉన్నాడు. కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు మాత్రం కోహ్లీదే.
  • అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్ కోహ్లి. కెప్టెన్ గా అతను 20 శతకాలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్ అతనే. సారథిగా కోహ్లి 5,864 పరుగులు చేశాడు.
  • టెస్టులు ఆడే ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్స్ అయిన 11 దేశాలపై సెంచరీలు చేసిన తొలి ఆటగాడు కోహ్లి.
  • 2012, 2015, 2016, 2018, 2023లో క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లి నిలిచాడు. ఇన్ని సార్లు ఈ రికార్డు అందుకుంది కోహ్లి మాత్రమే.
  • దక్షిణాఫ్రికాలో 50 కంటే ఎక్కువ సగటు, ఆస్ట్రేలియాలో 43.76, ఇంగ్లాండ్‌లో 42.36 సగటుతో కోహ్లి పరుగులు సాధించాడు.
  • కోహ్లి అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో (2018-19) తన తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఆసీస్ లో సిరీస్ దక్కించుకున్న ఫస్ట్ ఆసియా కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు.
  • కోహ్లి కెప్టెన్సీలో జట్టు తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆయన నాయకత్వంలో భారతదేశం వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలుచుకుంది. 2013 నుండి 2021 వరకు భారతదేశం అజేయమైన హోమ్ రికార్డుతో అదరగొట్టింది.
  • ఇవే కాకుండా కోహ్లి మరెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను దాటాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా నిలిచిపోయాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం