భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టెస్టుల నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‍కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని నేడు (మే 12) అధికారికంగా ప్రకటించాడు.
టెస్టుల్లో కొనసాగాలంటూ కోహ్లీకి నచ్చజెప్పేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని కొంతకాలంగా సమాచారం వస్తోంది. అయితే, ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకునేందుకే కోహ్లీ డిసైడ్ అయ్యాడు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇక నుంచి భారత్ తరఫున వన్డేల్లో ఒక్కటే అతడు బరిలోకి దిగనున్నాడు.
టెస్టు క్రికెట్ తనను చాలా తీర్చిద్దిందని, పాఠాలు నేర్పిందని విరాట్ కోహ్లీ ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశాడు. సంతోషంగా వైదొలుగుతున్నానని రాసుకొచ్చాడు. “14 కిందట టెస్టు క్రికెట్ క్యాప్ ధరించా. నిజంగా చెప్పాలంటే ఈ ఫార్మాట్‍లో నా జర్నీ ఇలా సాగుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ ఫార్మాట్ నన్ను టెస్ట్ చేసింది. తీర్చిద్దింది, చాలా పాఠాలు నేర్పింది. ఇవి జీవితాంతం నాతోనే ఉంటాయి” అని విరాట్ కోహ్లీ రాశారు.
టెస్టు క్రికెట్ ఆడడం తనకు ఎంతో ఇష్టమని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదని రాసాడు. కానీ ఇదే సరైన సమయం అనిపించిందని పేర్కొన్నాడు. హృదయం నుంచి సంతోషంగా తప్పుకుంటున్నానని తెలిపాడు. తన సహచరుల కూడా కృతజ్ఞతలు తెలిపాడు. తన టెస్టు కెరీర్‌ను ఎప్పుడూ చూసుకున్నా సంతోషం కలుగుతుందని రాశాడు కోహ్లీ.
భారత్ తరఫున విరాట్ కోహ్లీ 123 టెస్టులు (210 ఇన్నింగ్స్) ఆడాడు. 46.85 అద్భుత సగటుతో 9,230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 అర్ధ శతకాలతో కోహ్లీ అదరగొట్టాడు. 254 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. అయితే, టెస్టుల్లో 10000 పరుగుల మార్క్ చేరకుండానే ఈ ఫార్మాట్‍కు వీడ్కోలు పలికాడు. ఆ మైలురాయికి 770 పరుగుల దూరంలో టెస్టుల నుంచి తప్పుకున్నాడు. టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలు చేశాడు విరాట్. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు తన పేరిట లిఖించుకున్నారు.
2011 జూన్ 30వ తేదీన వెస్టిండీస్‍తో మ్యాచ్‍లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ. సుమారు 14 ఏళ్ల టెస్టు కెరీర్లో అద్భుత ప్రదర్శనతో చాలా మ్యాచ్‍ల్లో అదరగొట్టారు. కెపెన్సీలోనూ భారత టెస్టు జట్టును నంబర్ వన్ ర్యాంకులో చాలా కాలం నిలబెట్టాడు.
టీమిండియాకు దూకుడు మంత్రాన్ని నేర్పాడు విరాట్ కోహ్లీ. ఓ రకంగా టెస్టు జట్టులో రెవల్యూషన్ తీసుకొచ్చాడు విరాట్. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల్లోనూ టీమిండియా గర్జించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక కూడా కోహ్లీ అదరగొట్టాడు. చివరగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడాడు కోహ్లీ. ఆ బోర్డర్ గవాస్కర్ సిరీస్‍లో సెంచరీ కూడా చేశాడు. ఇక ఈ సుదీర్ఘ ఫార్మాట్‍కు అల్విదా చెప్పేశాడు. కీలకమైన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‍కు ముందు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ గత వారం టెస్టు క్రికెట్‍కు వీడ్కోలు పలికాడు. ఐదు రోజులు తిరగకుండానే విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార్మాట్‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో జూన్‍లో ఇంగ్లండ్‍లో మొదలుకానున్న టెస్టు సిరీస్‍లో భారత్‍కు ఎవరు కెప్టెన్సీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇద్దరు సీనియర్ స్టార్ బ్యాటర్లు తప్పుకోవడంతో జట్టు ఎలా ప్రదర్శన చేస్తుందో అనేది కూడా ఆసక్తికరం. ఇక, రోహిత్, కోహ్లీ టీమిండియా తరఫున వన్డేలే ఆడనున్నారు. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలుపు తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్