Virat Kohli Records: విరాట్ కోహ్లి సాధించిన ఈ ఐదు రికార్డులు బ్రేక్ చేయడం అసాధ్యమేనా?
Virat Kohli Records: విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ కాలంలో అతడు క్రియేట్ చేసిన ఈ ఐదు రికార్డులు బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మరి ఆ రికార్డులేంటో ఒకసారి చూద్దాం.
Virat Kohli Records: విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వన్డేల్లో అతని రికార్డులు అనితర సాధ్యం. అసాధ్యమనుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేసిన ఘనత అతని సొంతం. మరి అలాంటి విరాట్ తన 16 ఏళ్ల కెరీర్లో సాధించిన ఐదు రికార్డులను మరెవరూ బ్రేక్ చేయలేరని అతని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
అత్యధిక వన్డే సెంచరీలు
విరాట్ కోహ్లి వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 50 సెంచరీలు చేసిన విషయం తెలుసు కదా. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేయడంతోపాటు 50వ సెంచరీతో దానిని బ్రేక్ చేశాడు.
రానున్న ఏళ్లలో అతడు మరిన్ని సెంచరీలు చేయడం ఖాయం. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వాళ్లలో విరాట్ కు దగ్గరగా ఉన్నది రోహిత్ (31 సెంచరీలు) మాత్రమే. ఆ లెక్కన కోహ్లి రికార్డు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమే.
ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు
గతేడాది వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి ఏకంగా 765 రన్స్ చేశాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2003 వరల్డ్ కప్ లో 673 రన్స్ తో సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు విరాట్ క్రియేట్ చేసిన ఈ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు
ఐపీఎల్ 2016లో విరాట్ కోహ్లి ఏకంగా 973 రన్స్ చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఐపీఎల్లో శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి దగ్గరగా వచ్చినా.. అతని రికార్డును బ్రేక్ చేసేలా కనిపించలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో 900 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక క్రికెటర్ కోహ్లియే.
వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు
ఛేజ్ మాస్టర్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లి వన్డేల్లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు కూడా 27 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతని తర్వాత టెండూల్కర్ 17 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. భవిష్యత్తులో ఛేజింగ్ లో కోహ్లి సాధించినన్న సెంచరీలు మరెవరూ చేస్తారని ఊహించడం కూడా కష్టమే.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు
విరాట్ కోహ్లి తన 16 ఏళ్ల కెరీర్లో మూడు ఫార్మట్లు కలిపి ఏకంగా 21 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అందులో 11 వన్డేల్లో, 3 టెస్టుల్లో, 7 టీ20ల్లో ఉన్నాయి. సచిన్ (20)ను వెనక్కి నెట్టి కోహ్లి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో కనీసం మరో మూడు, నాలుగేళ్లు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ ఐదు రికార్డుల్లో కొన్ని మరింత మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ లెక్కన విరాట్ రికార్డులకు చేరువగా వచ్చే మరో ప్లేయర్ ప్రపంచ క్రికెట్‌లో ఉండటం అనుమానమే.