Kohli: ఢిల్లీ రంజీ టీమ్‌లో చేరిన కోహ్లి - ప్రాక్టీస్ వీడియోలు వైరల్ - మ్యాచ్‌కు భారీగా బందోబస్తు!
Kohli: ఢిల్లీ రంజీ టీమ్‌లో విరాట్ కోహ్లి భాగమయ్యాడు. ఢిల్లీ రంజీ ప్లేయర్లతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కు బందోబస్తును పెంచబోతున్నట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌ప్రకటించింది.
విరాట్ కోహ్లి రంజీ మ్యాచ్ ఆడుతాడా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. మంగళవారం ఢిల్లీ రంజీ టీమ్‌లో కోహ్లి భాగమయ్యాడు. రంజీ ఆటగాళ్లతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.
దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనుండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చివరగా కోహ్లి 2012 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్ ఆడాడు.ఆ తర్వాత టీమిండియా స్థానం దక్కడం, స్టార్ ప్లేయర్‌గా మారడంతో దేశవాళీ టోర్నీలకు కోహ్లి పూర్తిగా దూరమయ్యాడు.
రైల్వేస్‌తో మ్యాచ్‌లో...
రైల్వేస్‌తో ఈ నెల 30 నుంచి ఢిల్లీ జట్టు రంజీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీమ్‌లో కోహ్లి స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. కోహ్లి కూడా ఈ ప్రాక్టీస్ సెషల్‌లో పాల్గొన్నాడు.
మిగిలిన ఆటగాళ్లతో పాటు రన్నింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఢిల్లీ ప్లేయర్లతో కలిసి ఫుట్‌బాల్ కూడా ఆడాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కోహ్లిని ఢిల్లీ టీమ్‌లో చూస్తుంటే ఓల్డ్ డేస్ గుర్తొస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యంగ్ విరాట్‌ను మళ్లీ చూసినట్లుగా ఉందని మరో నెటిజన్ అన్నాడు. కింగ్ మళ్లీ తన డెన్‌లోకి వచ్చినట్లుగా ఉందని మరో క్రికెట్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు.
190 పరుగులు...
ఈ రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లి. ఈ సిరీస్‌లో దారుణ పరాభవం నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టింది.
రోహిత్ శర్మ, పంత్...
ఈ రూల్‌లో భాగంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, పంత్‌తో పాటు పలువురు టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే రంజీ మ్యాచ్ ఆడాడు. ముంబై తరఫున బరిలో దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దారుణంగా ఫెయిలయ్యారు. పంత్ (ఢిల్లీ), గిల్ (పంజాబ్) కూడా రాణించలేకపోయారు. కోహ్లి కూడా వారినే అనుసరిస్తాడా? జోరును చూపుతాడా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు.
బందోబస్తు...
ఆయుష్ బదోని కెప్టెన్సీలో కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు బందోబస్తును భారీగా పెంచుతోన్నట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
టాపిక్