Virat Kohli Post: విరాట్ కోహ్లి రిటైర్ అవుతున్నాడా.. అనుష్కతో విడిపోతున్నాడా.. ఏంటీ పోస్ట్ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
Virat Kohli Post: విరాట్ కోహ్లి చేసిన ఓ పోస్టుపై ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు రిటైర్ అవుతున్నావా లేక అనుష్కతో విడిపోతున్నావా అంటూ గందరగోళంగా ఉన్న ఈ సోషల్ మీడియా పోస్టుపై వాళ్లు ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
Virat Kohli Post: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మంగళవారం (నవంబర్ 19) రాత్రి తన ఎక్స్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అసలు ఏ సందర్భంలో ఈ పోస్ట్ చేస్తున్నాడో మొదట చెప్పలేదు. అతని స్టేట్మెంట్ చదువుతుంటే ఏదో పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాడేమో అనిపించింది. చివరికి చూస్తే అది తన క్లోతింగ్ బ్రాండ్ Wrogn పదేళ్ల సెలబ్రేషన్స్ కు సంబంధించినది అని తేలింది.
విరాట్ కోహ్లి పోస్ట్ ఇదీ..
విరాట్ కోహ్లి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న బ్రాండ్ Wrogn. దీనిని ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా విరాట్ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశాడు. అయితే ఆ విషయాన్ని అతడు చెప్పిన విధానం మాత్రం కాస్త గందరగోళానికి గురి చేసింది. రిటైర్ అవుతున్నాడా లేక అనుష్కతో విడిపోతున్నాడా అనే స్థాయిలో ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి గతంలో తన టీ20, టెస్ట్ కెప్టెన్సీలను వదిలేసే సమయంలోనూ విరాట్ కోహ్లి ఇదే స్టైల్లో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడూ అలాంటిదే ఏదో చెప్పబోతున్నాడని ఆ పోస్ట్ రెండు లైన్లు చదివితే అనిపిస్తోంది. చివరికి చూస్తే అది తన బ్రాండ్ Wrogn పదేళ్ల సెలబ్రేషన్ కు సంబంధించినది అని తేలడంతో ఫ్యాన్స్ ఒకరకంగా విరాట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోహ్లిపై ట్రోలింగ్
ఈ పోస్ట్ చూసి చాలా మంది ఫ్యాన్స్ విరాట్ కోహ్లిని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నావ్.. దానికి ఇలాంటి పోస్ట్ ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఒక్కసారిగా చూడగానే షాక్ కు గురయ్యానంటూ మరికొందరు అన్నారు. ఇలాంటి పోస్టులు చేస్తూ వెళ్తే.. ఏదో ఒక రోజు నిజంగా రిటైర్మెంట్ పోస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోరని ఓ అభిమాని అనడం గమనార్హం. ఎందుకింత భయపెడతావ్.. ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్ వాడటం మానుకో అని మరొకరు కోహ్లికి సూచించారు.
మరోవైపు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో బిజీగా ఉన్నాడు. శుక్రవారం (నవంబర్ 22) నుంచి పెర్త్ లో తొలి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఫామ్ లేమితో బాధపడుతున్న అతడు ఆస్ట్రేలియాలాంటి కీలకమైన పర్యటనలో రాణించాలని చూస్తున్నాడు.
అందులోనూ తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లేకపోవడంతో బ్యాటింగ్ భారం విరాట్ పైనే పడింది. ఈ నేపథ్యంలో అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో విఫలమైన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ అతనికి పెద్ద సవాలుగానే మారింది.