Virat Kohli: విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్-virat kohli played worst shot of his career says former cricketer sanjay manjrekar ind vs nz 2nd test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Virat Kohli: విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Oct 25, 2024 03:26 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. సాంట్నర్ బౌలింగ్ లో ఓ ఫుల్ టాస్ ను లెగ్ సైడ్ లో షాట్ కొట్టడానికి ప్రయత్నించి విరాట్ క్లీన్ బౌల్డ్ అయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడు: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ (AP)

Virat Kohli: విరాట్ కోహ్లి న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఔటైన తీరుపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లి చెత్త షాట్

న్యూజిలాండ్ తో పుణెలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు విరాట్ కోహ్లి ఔటైన తీరు క్రికెట్ పండితులను, అభిమానులను షాక్‌కు గురి చేసింది. మిచెల్ సాంట్నర్ వేసిన ఓ ఫుల్ టాప్ బాల్ కు విరాట్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంత సులువైన బంతికి కోహ్లిలాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఔట్ కావడం.. అందులోనూ టీమ్ కు అతడు క్రీజులో ఉండటం ఎంతో అవసరమైన సమయంలో విరాట్ ఇలా చేయడం ఎవరికీ మింగుడు పడటం లేదు.

దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగానే స్పందించాడు. అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “ఓ డియర్! ఔటవడానికి విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత చెత్త షాట్ ఆడాడని అతనికి కూడా తెలుసు. అతన్ని చూసి జాలి పడాల్సిందే. ఎందుకంటే ఎప్పటిలాగే అతడు నిజాయతీతో, మంచి ఇన్నింగ్స్ ఆడాలన్న ఉద్దేశంతోనే క్రీజులోకి వచ్చాడు” అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

ఈ మధ్య కాలంలో కోహ్లి ఔటవుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్లో నడుము ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి ఔటయ్యాడు. అయినా అప్పీల్ చేయలేదు. ఈ మధ్యే బంగ్లాదేశ్ తో టెస్టులో బంతి తన బ్యాట్ కు తగిలినా అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వడంతో డీఆర్ఎస్ తీసుకోకుండానే వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు సాంట్నర్ బౌలింగ్ లో ఔటైన తీరు మాత్రం చాలా వింతగా ఉంది.

ఆసియాలో కోహ్లి స్పిన్ తంటాలు

విరాట్ కోహ్లి గత మూడేళ్లుగా ఆసియాలో స్పిన్ బౌలింగ్ ఆడటానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతని గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2021 నుంచి 26 ఇన్నింగ్స్ లో స్పిన్ బౌలింగ్ లో కోహ్లి చేసిన పరుగులు కేవలం 606 మాత్రమే. 21సార్లు ఔటయ్యాడు. సగటు కేవలం 28.85 కావడం విశేషం. స్ట్రైక్ రేట్ 50 కూడా లేదు.

స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి కోహ్లి పడుతున్న ఇబ్బందులపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. విరాట్ కోహ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోవడం కూడా అతడు సమర్థంగా స్పిన్ ఆడకపోవడానికి ఓ కారణమని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా.. అసలు మ్యాచ్ లో ఆడటం పూర్తి భిన్నంగా ఉంటుందని, స్వదేశంలో సుదీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందని కుంబ్లే అన్నాడు.

పుణె టెస్టులో విరాట్ కోహ్లి మరోసారి విఫలమవడంతో ఇండియా కూడా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 156 పరుగులకే కుప్పకూలడంతో న్యూజిలాండ్ కు 103 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి రోజు నుంచే విపరీతమైన స్పిన్ అవుతుండటం, కివీ బౌలర్ సాంట్నర్ ఏడు వికెట్లు తీయడం చూస్తుంటే.. నాలుగో ఇన్నింగ్స్ లో ఇండియా టార్గెట్ చేజ్ చేసి గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అదే జరిగితే స్వదేశంలో వరుసగా 18 టెస్టుల సిరీస్ ల జైత్రయాత్రకు ముగింపు పడుతుంది.

Whats_app_banner